సూరత్: ‘మోడీ సర్‌నేమ్’పై వ్యాఖ్యానించినందుకుగాను క్రిమినల్ పరువునష్టం కేసులో ఈ నెల29న కోర్టుకు హాజరు కావలసిందిగా సూరత్‌లోని మెజిస్ట్రేట్ కోర్టు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకి సమ్మన్ జారీచేసింది. రాహుల్ గాంధీ జూన్24న కోర్టు ముందు హాజరై వాగ్మూలం ఇచ్చాక, కొత్తగా ఇద్దరు సాక్షుల వాంగ్మూలం తీసుకున్నందున, మరోసారి వాంగ్మూలం ఇచ్చేందుకు అక్టోబర్ 29న కోర్టు ముందు హాజరు కావాల్సిందిగా చీఫ్ జ్యూడీషియల్ మెజిస్ట్రేట్ ఏ.ఎన్. దావే ఆదేశించారు. ఇదిలావుండగా రాహుల్ గాంధీ ఇదివరలో అంటే, 2019 అక్టోబర్‌లో కూడా కోర్టు ముందు హాజరయి తన వ్యాఖ్యలను తాను నేరంగా భావించడంలేదని తెలిపారు. కాగా అక్టోబర్ 29న మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటలలోపు రాహుల్ గాంధీ సూరత్ మెజిస్ట్రేట్ కోర్టుకు హాజరవుతారని ఆయన తరఫు న్యాయవాది కిరీట్ పన్వాలా తెలిపారు.
సూరత్‌కు చెందిన బిజెపి శాసనసభ్యుడు పూర్ణేశ్ మోడీ ఐపిసి సెక్షన్లు 499, 500 కింద 2019 ఏప్రిల్‌లో రాహుల్ గాంధీ మీద పరువు నష్టం దావా దాఖలు చేశారు. ఆయన యావత్ మోడీ సముదాయాన్నే కించపరిచే వ్యాఖ్యచేశారని పేర్కొన్నారు. చాలా మందికి వర్తించే మోడీ సముదాయం పేరును ఎలా కించపరుస్తారని ఆయన వాదన.
2019 ఏప్రిల్ 13న కర్నాటకలోని కోలార్‌లో ఎన్నికల ర్యాలీ అప్పుడు రాహుల్ గాంధీ ప్రసంగిస్తూ “ నీరవ్ మోడీ, లలిత్ మోడీ, నరేంద్ర మోడీ…ఈ మోడీలంతా దోపిడీదారులు, వారిదంతా మోడీ సముదాయం’ అని పేర్కొన్నారు అన్నది ఇక్కడ గమనార్హం.