రూము తీసుకుని బెట్టింగ్ నిర్వహిస్తున్న గుజరాత్ యువకులు
మనతెలంగాణ, హైదరాబాద్ : ఆన్‌లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్న గుజరాత్ ముఠాను ఎస్‌ఆర్ నగర్ క్రైం పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకోగా, మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. వారి వద్ద నుంచి రూ.1.15కోట్ల నగదు, నాలుగు మొబైల్ ఫోన్లు, క్యాష్ కౌంటింగ్ మిషన్‌ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం… గుజరాత్ రాష్ర్టం, సూరత్‌కు చెందిన విశాల్ పటేల్ కోరియర్ బాయ్‌గా పనిచేస్తున్నాడు, నగరంలోని గౌలిగూడలో ఉంటూ బెట్టింగ్ నిర్వహిస్తున్నాడు, కమ్‌లేష్ రావత్ కొరియర్ బాయ్‌గా పనిచేస్తున్నాడు, పటేల్ హితేష్ అంబాలా, ధర్మేష్ బాయ్ కలిసి ఆన్‌లైన్‌లో బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. ధర్మేష్ బాయ్ పరారీలో ఉన్నాడు. విశాల్ పటేల్, కమ్‌లేష్ రావత్ బెట్‌బాయ్9.కామ్ ద్వారా బెట్టింగ్ నిర్వహిస్తున్నారు.
గౌలిగూడలో ఉంటున్న బెట్టింగ్ ప్రధాన నిర్వాహకుడు ధర్మేష్ బాయ్ పక్షాన బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని నగరంలో పంటర్లను నియమించుకుని బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. బెట్టింగ్‌లో రూ.50,000లోపు నిర్వహిస్తున్నారు. బెట్టింగ్ నిర్వహించేవారికి ఐడి నంబర్ ఇస్తున్నారు. నిందితులు గుజరాత్ నుంచి నగరానికి వచ్చి గౌలిపురలో రూమును అద్దెకు తీసుకుని ఆన్‌లైన్‌లో బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. ఇద్దరు నిర్వాహకులు డబ్బులు వసూలు చేసి పటేల్ హితేష్‌కు ఇస్తున్నారు, అతడు బెట్టింగ్ ప్రధాన నిర్వాహకుడు ధర్మేష్ భాయ్‌కు ఫోన్ పే, గూగుల్ పే ద్వారా పంపిస్తున్నాడు. ఈ విషయం ఎస్‌ఆర్ నగర్ పోలీసులకు తెలియడంతో దాడి చేసి పట్టుకున్నారు. ఇన్స్‌స్పెక్టర్ సైదులు, ఎస్సై శ్రీకాంత్‌గౌడ్, గిరిధర్ తదితరులు పట్టుకున్నారు.