తీస్తాకు బెయిలా? తక్షణ అరెస్టా?
తేల్చాల్సింది ఇక సుప్రీంకోర్టే
ఆమె సరెండర్‌కు హైకోర్టు ఆదేశాలు
అత్యున్నత న్యాయస్థానంలో కేసు
త్రిసభ్య ధర్మాసనం విచారణతోనే స్పష్టత
గాంధీనగర్ /న్యూఢిల్లీ : ప్రముఖ సామాజిక, హక్కుల నాయకురాలు తీస్తా సేతల్వాద్‌కు గుజరాత్ హైకోర్టు బెయిల్ నిరాకరించింది. ఆమె వెంటనే సరెండర్ కావాలని ఆదేశించింది. 2002 గుజరాత్ ఘర్షణల ఉదంతంలో ఆమె తప్పుడు సాక్షాలు ఇచ్చారని, సాక్షులతో తప్పుడు వాదనలు విన్పించేలా చేశారనే అభియోగాలు ఉన్నాయి. అమాయకులను కేసులో ఇరికించేందుకు ఆమె యత్నిస్తున్నారనే అంశం కూడా ప్రస్తావనకు వచ్చింది.
ఈ కేసుకు సంబంధించి ఆమె బెయిల్‌పై ఉన్నారు. ఇకపై ఆమెకు బెయిల్ కుదరదని వెంటనే లొంగిపోవాలని హైకోర్టు ఆదేశాలు వెలువరించింది. కేసుకు సంబంధించి గత ఏడాది సెప్టెంబర్‌లో సుప్రీంకోర్టు ఆమెకు బెయిల్ ఇచ్చింది. దీనితో అరెస్టు నుంచి ఆమె ఉపశమనం పొందారు. ఆమె సరెండర్ కావాలనే ఆదేశాలపై స్పందిస్తూ సేతల్వాద్ లాయర్ సుప్రీంకోర్టును తాము తిరిగి సంప్రదిస్తామని అంతవరకూ సరెండర్ ఆదేశాలను నిలిపివేయాలని కోరారు. అయితే దీనిని హైకోర్టు తోసిపుచ్చింది.
సుప్రీంకోర్టులో మిగిలిన ఆశ
గుజరాత్ హైకోర్టు తనను సరెండర్ కావాలని ఆదేశించడాన్ని కొట్టివేయాలని సేతల్వాద్ శనివారమే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే ఇద్దరు జడ్జిలు రూలింగ్ విషయంలో విభేదించారు. దీనితో ఈ పిటిషనన్‌ను త్రిసభ్య ధర్మాసనం విచారణకు నివేదించారు. ఈ క్రమంలో సేతల్వాద్ బెయిల్ కొనసాగింపు లేదా సరెండర్ విషయాలు ఈ త్రిసభ్య ధర్మాసనం ఆదేశాలపైనే ఆధారపడ్డాయి. ఆమెకు తాత్కాలిక ఉపశమనం కల్పించాలనే విషయంపై ఇద్దరు జడ్జిలు వేర్వేరు అభిప్రాయాలను వ్యక్తపర్చారు.
దీనితో సేతల్వాద్ కేసును ప్రధాన న్యాయమూర్తి సమీక్షకు పంపించారు. త్రిసభ్య ధర్మాసనం ఏర్పాటు ప్రక్రియ , విచారణ వేగవంతం జరిగేందుకు ప్రధాన న్యాయమూర్తి స్పందించాల్సి ఉంది. సెప్టెంబర్ నుంచి బెయిల్‌పై ఉన్న ఆమె ఇప్పుడు తక్షణమే సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం ద్వారా కేసు విచారణను పొందగల్గితే తక్షణ అరెస్టు నుంచి ఉపశమనం పొందగల్గుతారు. అంతకు ముందు గుజరాత్ హైకోర్టు ఆమె తక్షణ సరెండర్‌కు ఆదేశిస్తూ అప్పటి ముఖ్యమంత్రి, ఇప్పటి ప్రధాని నరేంద్ర మోడీ గౌరవప్రతిష్టలను దెబ్బతీసేందుకు, ఎన్నికైన ప్రజా ప్రభుత్వాన్ని విచ్ఛిన్నం చేసేందుకు యత్నించారని పేర్కొంది. ఈ కేసు విచారణ గుజరాత్ హైకోర్టులో జస్టిస్ నిర్జార్ దేశాయ్ సారధ్యంలోని ధర్మాసనం చేపట్టింది.