Monday, December 23, 2024

ప్రధాని విద్యార్హతలు తెలుసుకునే హక్కు ప్రజలకు లేదా?: కేజ్రీవాల్

- Advertisement -
- Advertisement -

మోడీ డిగ్రీ సర్టిఫికెట్లు చూపించాల్సిన అవసరం లేదు
కేజ్రీవాల్‌కు రూ.25 వేల జరిమానా విధించిన గుజరాత్ హైకోర్టు
అహ్మదాబాద్:ప్రధాని నరేంద్ర మోడీ విద్యార్హతల విషయంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు భంగపాటు ఎదురైంది. ఈ అంశంపై గుజరాత్ హైకోర్టు శుక్రవారం కీలక తీర్పు వెలువరించింది. ప్రధాని డిగ్రీ, పిజి పత్రాలను చూపించాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది. ఈ మేరకు ఏడేళ్ల క్రితం కేంద్ర సమాచార కమిషన్( సిఐసి) ఇచ్చిన ఆదేశాలను కొట్టివేసిన న్యాయస్థానం కేజ్రీవాల్‌కు రూ.25 వేలు జరిమానా విధించింది.

ప్రధాని నరేంద్ర మోడీ విద్యార్హతలపై ఆరోపణలు చేస్తున్న కేజ్రీవాల్ ఆయన డిగ్రీ, పిజి సర్టిఫికెట్ల కోసం 2016లో సమాచార హక్కు చట్టం ద్వారా కేంద్ర సమాచార కమిషన్‌కు దరఖాస్తు చేసుకున్నారు. ఈ దరఖాస్తులను పరిశీలించిన సిఐసి… మోడీ డిగ్రీ, పిజి సర్టిఫికెట్లను చూపించాలంటూ పిఎంఓ కార్యాలయం పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్‌ను, గుజరాత్, ఢిల్లీ యూనివర్సిటీల పిఐఓలను 2016 ఏప్రిల్‌లో ఆదేశించింది. అయితే మూడు నెలల తర్వాత సిఐసి ఉత్తర్వులను సవాలు చేస్తూ గుజరాత్ యూనివర్సిటీ హైకోరును ఆశ్రయించింది. దీంతో సిఐసి ఆదేశాలపై అప్పట్లో హైకోర్టు స్టే విధించింది. ఇటీవలే ఈ కేసు తెరమీదికి వచ్చింది.

దీనిపై గత నెల హైకోర్టులో విచారణ జరిగింది. గుజరాత్ యూనివర్సిటీ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు.‘ మోడీ విద్యార్హతలను దాచి పెట్టాల్సిన అవసరం లేదు. ఆ వివరాలు ఇప్పటికే పబ్లిక్ డొమైన్‌లో, యూనివర్సటీ వైబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. అయితే ప్రజాస్వామ్యంలో ఉన్నత పదవిలో ఉన్న వ్యక్తి డాక్టరేట్ అయినా, నిరక్షరాస్యుడైనా పెద్ద తేడా ఏమీ ఉండదు. అంతేకాక ఈ వివరాలను ప్రత్యేకంగా బైటపెట్టడంలో ప్రజాప్రయోజనం ఏమీ లేదు. ఇక ప్రధాని వ్యక్తిగత గోప్యతపై ఇది ప్రభావం చూపుతుంది. ఓ వ్యక్తి బాధ్యతారహితమైన అత్యుత్సాహానికి సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు’ అని మెహతా వాదించారు. అయితే ఈ వాదనలను కేజ్రీవాల్ తరఫు నాయవాది ఖండించారు.

ఆ పత్రాలు ఇంటర్నెట్‌లో అందుబాటులో లేవని, ఆధారాల కోసమే వాటి కాపీలను అడుగుతున్నామన్నారు. ఇరుపక్షాల వాదనలను విన్న న్యాయస్థానం శుక్రవారం కీలక తీర్పు వెలువరించింది. మోడీ సర్టిఫికెట్లను పిఎంఓ కానీ యూనివర్సిటీ కానీ చూపించాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది. ఈ సందర్భంగా ఆ పత్రాలను కోరిన కేజ్రీవాల్‌కు రూ.25 వేల జరిమానా విధించింది. ఈ మొత్తాన్ని నాలుగు వారాల్లోగా గుజరాత్ రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీలో డిపాజిట్ చేయాలని ఆదేశించింది.

ప్రధాని విద్యార్హతలు తెలుసుకునే హక్కు ప్రజలకు లేదా?: కేజ్రీవాల్
కాగా ఈ తీర్పుపై కేజ్రీవాల్ స్పందించారు. తమ ప్రధాని ఏ విధంగా విద్యాభ్యాసం చేశారో తెలుసుకునే హక్కు ఈ దేశానికి లేదా? ఆయన డిగ్రీని బైటపట్టడాన్ని వాళ్లు కోర్టులో గట్టిగా వ్యతిరేకించారు, ఎందుకు? ఆయన డిగ్రీని చూపించాలని కోరిన వ్యక్తికి జరిమానా వేస్తారా? నిరక్షరాస్యుడైన, లేదా తక్కువ చదువుకొన్న ప్రధాని దేశానికి ప్రమాదకరం’ అని కేజ్రీవాల్ ఓ ట్వీట్‌లో వ్యాఖ్యానించారు. కాగా ప్రధాని మోడీ 1978లోగుజరాత్ యూనివర్సిటీనుంచి గ్రాడ్యుయేషన్, 1983లో ఢిల్లీ యూనివర్సిటీలో పిజి చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News