గాంధీనగర్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత ఓటింగ్ గురువారం కొనసాగుతోంది. ఉదయం నుంచే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగిస్తున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు 34.48 శాతం ఓటింగ్ నమోదయినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. తొలి విడతలో భాగంగా 19 జిల్లాల పరిధిలోని 89 నియోజకవర్గాలకు నేటు ఓటింగ్ జరుగుతోంది. మొత్తం 788 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. సాయంత్రం 5.00 గంటల వరకు ఈ ఓటింగ్ కొనసాగనున్నది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ భావ్‌నగర్‌లో ఓటేశారు. క్రికెటర్ రవీంద్ర జడేజా, ఆయన తండ్రిఅనిరుధ్ సిన్హా, సోదరి నైనా జడేజా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రవీంద్ర జడేజా సతీమణి రీవాబా రాజ్‌కోట్‌లో ఓటేశారు. రీవాబా ఈ ఎన్నికల్లో బిజెపి తరఫున పోటీ చేస్తుండగా, ఆయన తండ్రి, సోదరి కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేశౠరు. కేంద్ర మంత్రులు పురుషోత్తమ్ రూపాలా, దర్శన జర్దోశ్, రాజ్‌కోట్ రాజకుటుంబానికి చెందిన మంధతా సిన్హా, జడేజా ఠాకూర్ సాహెబ్ దంపతులు, కాంగ్రెస్ దివంగత నేత అహ్మద్ పటేల్ కూతురు ముంతాజ్ పటేల్ తమ ఓటు హక్కును తొలి గంటల్లోనే వినియోగించుకున్నారు.
ఇప్పటి వరకు తాపిలో అత్యధికంగా 46.35 శాతం ఓటింగ్ జరుగగా, అమ్రేలిలో అతి తక్కువగా 32.01 శాతం ఓటింగ్ జరిగింది. ఇక బరూచ్‌లో 35.98 శాతం, భావ్‌నగర్‌లో 32.74 శాతం, బోతాడ్‌లో 30.26 శాతం, డాంగ్స్‌లో 46.22 శాతం, దేవ్‌భూమి ద్వారకాలో 33.89 శాతం, గిర్ సోమ్‌నాథ్‌లో 35.99 శాతం, జామ్‌నగర్‌లో 30.34 శాతం, జునాగఢ్‌లో 35.96 శాతం, కచ్‌లో 33.44 శాతం, మోర్బిలో 38.61 శాతం ఓటింగ్ జరిగినట్లు తెలిసింది.