ఐపిఎల్‌లో గుజరాత్ టైటాన్స్ తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ 39 పరుగుల తేడాతో డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ 20 ఓవర్లలో 3 వికెట్లకు 198 పరుగులు చేసింది. తర్వాత లక్షఛేదనకు దిగిన కోల్‌కతా నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లకు 159 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. కెప్టెన్ అజింక్య రహానె (50) తప్ప మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు.అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్‌కు ఓపెనర్లు సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్ మరోసారి శుభారంభం అందించారు.
ఇద్దరు కోల్‌కతా బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ స్కోరును ముందుకు నడిపించారు. శుభ్‌మన్ కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. కోల్‌కతా బౌలర్లపై ఎదురుదాడి చేస్తూ స్కోరును పరిగెత్తించాడు. ఈ జోడీని విడగొట్టేందుకు ప్రత్యర్థి జట్టు బౌలర్లు చేసిన ప్రయత్నాలు చాలా సేపటి వరకు ఫలించలేదు. అద్భుత బ్యాటింగ్‌ను కనబరిచిన సాయి 36 బంతుల్లో ఆరు ఫోర్లు, ఒక సిక్స్‌తో 52 పరుగులు చేసి ఔటయ్యాడు. శుభ్‌మన్ 55 బంతుల్లోనే పది ఫోర్లు, 3 సిక్సర్లతో 90 పరుగులు చేశాడు. ఇక ధాటిగా ఆడిన జోస్ బట్లర్ 23 బంతుల్లోనే 8 ఫోర్లతో 41 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.