మళ్లీ ఓడిన కోల్‌కతా, గుజరాత్‌కు ఆరో విజయం
ముంబై: ఐపిఎల్‌లో కొత్త టీమ్ గుజరాత్ టైటాన్స్ హవా కొనసాగుతోంది. ఈ టోర్నీలో హార్దిక్ పాండ్య సేన ఆరో విజయాన్ని నమోదు చేసింది. శనివారం ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో గుజరాత్ 8 పరుగుల తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను ఓడించింది. ఈ విజయంతో గుజరాత్ 12 పాయింట్లతో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా నైట్‌రైడర్స్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 148 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది.
ఊరిస్తున్న లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతాకు ఆరంభంలోనే కష్టాలు మొదలయ్యాయి. ఓపెనర్లు శామ్ బిల్లింగ్స్ (4), సునీల్ నరైన్ (5)లు జట్టుకు శుభారంభం అందించలేక పోయారు. ఇద్దరిని షమీ వెనక్కి పంపాడు. నితీష్ రాణా (2) కూడా విఫలమయ్యాడు. ఇక జట్టును ఆదుకుంటాడని భావించిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కూడా నిరాశ పరిచాడు. 12 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. దీంతో కోల్‌కతా 34 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో రింకు సింగ్, వెంకటేశ్ అయ్యర్‌లు కొద్ది సేపు పోరాటం చేశారు.
ఇద్దరు సమన్వయంతో ఆడుతూ స్కోరును ముందుకు తీసుకెళ్లారు. ధాటిగా ఆడిన రింకు సింగ్ 4 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 35 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆ కొద్ది సేపటికే వెంకటేశ్ అయ్యర్ (17) కూడా పెవిలియన్ చేరాడు. ఈ సమయంలో ఆండ్రి రసెల్ కొద్ది సేపు విధ్వంసక బ్యాటింగ్‌తో అలరించాడు. గుజరాత్ బౌలర్లపై ఎదురుదాడికి దిగిన రసెల్ స్కోరును పరిగెత్తించాడు. విధ్వంసక ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్న రసెల్ 25 బంతుల్లోనే ఆరు భారీ సిక్సర్లు, ఒక ఫోర్‌తో 48 పరుగులు చేసి ఔటయ్యాడు. ఉమేశ్ యాదవ్ 15(నాటౌట్) చివరి వరకు పోరాడినా ఫలితం లేకుండా పోయింది. గుజరాత్ బౌలర్లు కచ్చితమైన లైన్ అండ్ లెన్త్‌తో బౌలింగ్ చేసి జట్టును గెలిపించారు.
ఆదుకున్న హార్దిక్
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్‌ను కెప్టెన్ హార్దిక్ పాండ్య ఆదుకున్నాడు. ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (7) తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరాడు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన హార్దిక్ కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో అలరించాడు. మరో ఓపెనర్ వృద్ధిమాన్ సాహా అండతో స్కోరును ముందుకు తీసుకెళ్లాడు. కీలక ఇన్నింగ్స్ ఆడిన సాహా 25 పరుగులు చేసి ఔటయ్యాడు. మరోవైపు డేవిడ్ మిల్లర్ రెండు సిక్సర్లు, ఒక ఫోర్‌తో 27 పరుగులు చేశాడు. కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన హార్దిక్ 4 ఫోర్లు, రెండు సిక్స్‌లతో 67 పరుగులు చేసి వెనుదిరిగాడు. మిగతావారు విఫలం కావడంతో గుజరాత్ స్కోరు 156 పరుగులకే పరిమితమైంది. కోల్‌కతా బౌలర్లలో రసెల్ ఒకే ఓవర్‌లో నాలుగు వికెట్లు పడగొట్టాడు.