అహ్మదాబాద్: ఐపిఎల్ 18లో గుజరాత్ టైటాన్స్ తొలి విజయాన్ని నమాదు చేసింది. శనివారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 36 పరుగుల తేడా గెలుపొందింది. గుజరాత్ బౌలర్లు నిప్పులు చెరిగే బంతులతో ముంబైని ముప్పు తిప్పలు పెట్టారు. దాంతో 197 పరుగుల లక్ష ఛేదనకు దిగిన ముంబై బ్యాటర్లు నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 160 పరుగులు మాత్రమే చేయగలిగారు. సూర్యాకుమార్ యాదవ్(48), తిలక్ వర్మ(39)లు మాత్రమే రాణించారు. మిగతా బ్యాటర్లందరూ తేలిపోయారు. దీంతో ముంబై రెండో ఓటమిని మూటగట్టుకొని పాయింట్ల పట్టికలో అట్టడుగుకు పడిపోయింది.
గుజరాత్ బౌలర్లలో మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ క్రిష్ణ రెండేసి వికెట్లు పడగొట్టగా కగిసో రబాడ, రవిశ్రీనివాసన్ చెరో వికెట్ దక్కించుకున్నారు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. ఓపెనర్లు సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్ జట్టుకు శుభారంభం అందించారు. ఇద్దరు ముంబై బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ స్కోరును ముందుకు తీసుకెళ్లారు.
కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన గిల్ 27 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్స్‌తో 38 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇక వన్‌డౌన్‌లో వచ్చిన జోస్ బట్లర్ కూడా బాగానే ఆడాడు. దూకుడును ప్రదర్శించిన బట్లర్ 24 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్స్‌తో 39 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. కీలక ఇన్నింగ్స్ ఆడిన సాయి సుదర్శన్ 41 బంతుల్లోనే రెండు సిక్సర్లు, 4 ఫోర్లతో 63 పరుగులు చేశాడు. రూథర్‌ఫోర్ట్ 2 సిక్స్‌లతో 18 పరుగులు సాధించాడు. షారుక్ ఖాన్ (9), రాహుల్ తెవాటియా (0), రషీద్ ఖాన్ (6) విఫలమయ్యారు.