భర్తసహా 19మందిని అరెస్ట్ చేసిన
గుజరాత్ పోలీసులు
దాహోద్: ఓ గిరిజన మహిళను వివస్త్రను చేసి అవమానించిన ఘటన గుజరాత్‌లో కాస్త ఆలస్యంగా వెలుగు చూసింది. దాహోద్ జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి బాధితురాలి భర్తసహా మొత్తం 19మంది నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఘటనను నిందితులు వీడియో తీసి వైరల్ చేయడంతో పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి వారిని పట్టుకున్నారు. వీడియో దృశ్యాల ఆధారంగా దాడికి పాల్పడ్డ నిందితులందరినీ అరెస్ట్ చేశామని దాన్‌పూర్ ఎస్‌ఐ బిఎం పటేల్ తెలిపారు. దాన్‌పూర్ తహసీల్ పరిధిలోని ఖజారీ అనే గిరిజన గ్రామంలో జులై 6న ఈ ఘటన జరిగింది. 23 ఏళ్ల మహిళ మరో వ్యక్తితో పారిపోతుండగా వాళ్లిద్దరినీ పట్టుకున్నట్టుగా చెబుతున్నారు.
మహిళపై ఆమె భర్త, బంధువులు అమానవీయ దాడికి పాల్పడ్డారు. జనం మధ్యే ఆమెను వివస్త్రను చేసి ఈడ్చుకుంటూ, కొడుతూ హింసించారు. భర్తను ఆమె భుజాలపై కూర్చోబెట్టి వీధిలో బలవంతంగా నడిపించారు. కొందరు మహిళలు ఆమె శరీరంపై వస్త్రాలు కప్పేందుకు యత్నించగా, వాటిని తొలగించారు. ఈ ఘటనను వీడియో తీసి వైరల్ చేశారు. దీనిపై ఆ రాష్ట్ర మహిళా కమిషన్ స్పందించింది. సమగ్ర దర్యాప్తు నివేదికను తమకు అందించాలని దాహోద్ జిల్లా ఎస్‌పిని ఆదేశించింది. ప్రస్తుతం బాధితురాలు పోలీసుల సంరక్షణలో ఉన్నట్టు కమిషన్ చైర్‌పర్సన్ లీలాబెన్ అంకోలీ తెలిపారు. తమ బృందం జిల్లాను సందర్శించి బాధితురాలి నుంచి వివరాలు సేకరిస్తుందని ఆమె అన్నారు.