Saturday, November 23, 2024

మోడీకి క్లీన్‌చిట్!

- Advertisement -
- Advertisement -

Corona again in india బయటికి అంతా సవ్యంగానే కనిపిస్తుంది. పద్ధతి ప్రకారమే జరుగుతుంది. యెక్కడా యే మాత్రం లోపం వుండదు. అంచెలంచెలుగా అన్ని దశలూ దాటి అంతిమ గమ్యానికి సాగిన ప్రక్రియ న్యాయబద్ధంగానే గోచరిస్తుంది. కాని చాలా మందికి అందులో న్యాయం కానరాదు. అందుకే న్యాయం చేయడమే కాదు. అది సంపూర్ణంగా జరిగిందనే విశ్వాసం కలిగించాలంటారు. ఇరవై సంవత్సరాల క్రితం గుజరాత్‌లో జరిగిన గోధ్రా అనంతర దారుణ మారణ కాండకు సంబంధించిన కేసులో ప్రధాని మోడీకి నిర్దోషిగా క్లీన్ చిట్ ఇస్తూ సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు అనేక మందికి యిలాగే అనిపిస్తుండడం గమనించవలసిన అంశం. సుప్రీంకోర్టు తీర్పులు మరి కొన్ని కూడా ఇలాంటి అభిప్రాయాన్నే కలిగించాయి.

దేశంలో వున్న పరిస్థితుల నేపథ్యమే అందుకు కారణమని అనుకోవాలా? 2002 ఫిబ్రవరిలో అహ్మదాబాద్‌లోని గుల్బర్గ్ సొసైటీ హోసింగ్ కాంప్లెక్స్‌లో దుండగ మూకలు జరిపిన చెప్పనలవికాని అమానుషకాండలో హతుడైన కాంగ్రెస్ మాజీ ఎమ్‌పి ఎషాన్ జాఫ్రీ భార్య జకియా జాఫ్రీ ప్రధాని నరేంద్ర మోడీ, మరి 63 మందిపై దాఖలు చేసుకొన్న కేసు అప్పీలును మొన్న శుక్రవారం నాడు సుప్రీంకోర్టు ముగ్గురు సభ్యుల ధర్మాసనం కొట్టివేసింది. అల్లర్ల వెనుక గల ‘లోతైన’ కుట్ర గురించి దర్యాప్తు చేయాలని ఆమె న్యాయస్థానానికి విజ్ఞప్తి చేసుకొన్నది. అప్పీలు ఎంతమాత్రం సమర్ధించదగినది కాదని ధర్మాసనం నిర్ధారించింది. ఈ కేసులో తొలుత అహ్మదాబాద్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్, ఆ తర్వాత ప్రత్యేక దర్యాప్తు సంస్థ (సిట్) సిఫారసును ఆమోదిస్తూ హైకోర్టు యిచ్చిన తీర్పులను సుప్రీంకోర్టు ధ్రువపరచింది.

అప్పీలును కొట్టివేయడంతో ఆగకుండా, దాని బాధ్యులకు గట్టిగా మొట్టికాయలు వేసింది. కొంతమంది అసంతృప్త గుజరాత్ అధికారులు, తదితరులు కలిసి కుట్రపూరిత ఉద్దేశాలతో వ్యవహారాన్ని సజీవంగా ఉంచడం కోసం తప్పుడు సమాచారంతో సంచలనం సృష్టించాలని ప్రయత్నించినట్టు పేర్కొన్నది. అక్కడితోనూ సరిపుచ్చలేదు.ఆ విధంగా న్యాయ ప్రక్రియను తప్పు పట్టినవారిని చట్టప్రకారం శిక్షించవలసి వుందని సూచించింది. ఈ తీర్పు వెలువడిన వెంటనే కేంద్ర హోం మంత్రి అమిత్ షా అమిత ఆనందభరితులయ్యారు. ‘నిజం బంగారం మాదిరిగా ధగద్ధగాయమానంగా ప్రకాశిస్తూ బయటపడింది. విషాన్ని మింగి కంఠంలో దాచుకొన్న శివుడి మాదిరిగా గత 19 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ మౌన వేదనను అనుభవించారు’ అని వ్యాఖ్యానించారు. రాజకీయ దురుద్దేశంతో మోడీపై ఆరోపణలు చేసినవారు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండగా జరిగిన 2002 ఫిబ్రవరి 28 అల్లర్లలో హత్యలు, రేప్‌లు దారుణంగా సాగిపోయాయి. మొత్తం 1044 మంది బలయిపోయారు. ఆస్తి విధ్వంసం విపరీతంగా జరిగింది.

రెండు లక్షల మంది నిర్వాసితులయ్యారు. ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీ సకాలంలో అల్లర్లను అరికట్టలేకపోయారని, సైన్యాన్ని దింపదంలో ఆలస్యం చేశారని ఈ కేసులో ఆరోపణలు వచ్చాయి. అమిత్ షా ఎ ఎన్ ఐ కిచ్చిన ఇంటర్వ్యూలో హక్కుల ఉద్యమకారిణి తీస్తా షెతల్వాడ్‌ను, ఆమె నడుపుతున్న ప్రభుత్వేతర సంస్థ (ఎన్‌జివొ)ను ప్రస్తావించారు. ఆమె హతుడైన మాజీ ఎమ్‌పి భార్య జకియా జాఫ్రీ ఉద్వేగపూరిత మనోభావాలను వాడుకొని ఈ కేసు దాఖలు చేయించిందని సుప్రీం ధర్మాసనం కూడా అభిప్రాయపడింది. అల్లర్లు జరుగుతున్నప్పుడు గుజరాత్ సిఎం నరేంద్ర మోడీ ప్రభుత్వం తన పోలీసును కావాలని నిద్రపుచ్చిందని అప్పట్లో సీనియర్ పోలీసు అధికారిగా పని చేసిన ఆర్‌బి శ్రీకుమార్, నానావతి కమిషన్ ఎదుట సాక్ష్యమిచ్చారు. అల్లర్లను మోడీ ఉద్దేశపూర్వకంగానే ఆపలేదని మరో పోలీసు అధికారి సంజీవ్ భట్ సుప్రీంకోర్టులో వొక అఫిడవిట్ దాఖలు చేశారు. ఆయన 1990 నాటి లాకప్ హత్య కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్నారు.

సుప్రీంకోర్టు తీర్పు వెలువడగానే తీస్తా షెతల్వాడ్, శ్రీకుమార్, సంజీవ్ భట్ లపై గుజరాత్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కేసు దాఖలు చేశారు. హుటాహుటిన తీస్తాను, శ్రీకుమార్‌ను అరెస్ట్ చేశారు. అంతా న్యాయ ప్రక్రియ ద్వారానే జరిగింది. జకియా జాఫ్రీ కేసును మేజిస్ట్రేట్ కోర్టు కొట్టివేయడం, సిట్‌ను నియమించడం, అది ప్రధాని మోడీకి క్లీన్ చిట్ ఇవ్వడం, హైకోర్టు దానిని ధ్రువీకరించడం, అప్పీలును సుప్రీంకోర్టు కొట్టివేయడం మొత్తం ఇరవై ఏళ్ళ న్యాయ ప్రస్థానం సవ్యంగానే సాగింది. కాని ఈ కేసులో న్యాయం జరిగిందనే అభిప్రాయం అంతటా ఏర్పడకపోడం, ఆ మేరకు సంతృప్తి వ్యక్తం కాకపోడమే గమనార్హం. కేసు ముగిసిన తర్వాత సుప్రీంకోర్టు సూచనలను పాటిస్తూ జరిగిన అరెస్టులు పగ సాధింపుగా పరిగణన పొందే అవకాశం ఉంది. ఈ కీలక తీర్పులో కేసుకు తోడ్పాటునిచ్చిన వారిని ఆరోపణలు చేసినవారిని, తప్పుపట్టిన అత్యున్నత న్యాయస్థానం, కేసు వేసి అప్పీలు చేసుకొన్న జకియా జాఫ్రీని ఏమీ అనకుండా అమాయకురాలుగా పరిగణించి వదిలివేసింది. అమానుష హత్యాకాండలో భర్తను కోల్పోయిన ఆమె బాధను ఆర్ధం చేసుకొన్నది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News