భారత చెస్ ఆటగాడు గుకేశ్ దొమ్మరాజు చరిత్ర సృష్టించాడు. సింగపూర్ వేదికగా జరిగిన ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్‌లో విజేతగా నిలిచి రికార్డు నెలకొల్పాడు. చైనా ఆటగాడు డింగ్ లిరెన్‌ను ఓడించి గుకేశ్ ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించాడు. డిఫెండింగ్ ఛాంపియన్ డింగ్ లిరెన్‌తో గురువారం జరిగిన టైటిల్ పోరులో విజేతగా నిలిచాడు. హోరాహోరీగా సాగిన 14వ రౌండ్‌లో విజయం గుకేశ్ వైపు నిలిచింది. 18 ఏళ్ల వయసులో 18వ ప్రపంచ ఛాంపియన్‌గా అవరించాడు.
దీంతో ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ గెలిచిన పిన్న వయస్కుడిగాను గుకేశ్ నయా రికార్డును సొంతం చేసుకున్నాడు. అంతేకాదు ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్‌ను సొంతం చేసుకున్న రెండో భారత ఆటగాడిగా గుకేశ్ చరిత్ర సృష్టించాడు. అంతకుముందు విశ్వనాథన్ ఆనంద్ ఈ టైటిల్ కైవసం చేసుకున్నాడు. ప్రపంచ చెస్ క్రీడాకారుల్లో మంచి ఫామ్‌లో ఉన్న గుకేశ్ ఈ ఛాంపియన్ షిప్ పోటీల్లో ఫెవరేట్‌గా బరిలోకి దిగాడు. 18 ఏళ్ల గుకేశ్ నెపోమినియాషి, కరువానా, నకముర వంటి మేటి గ్రాండ్ మాస్టర్స్ టోర్నీలో విజేతగా నిలవడంతో డిఫెండింగ్ ఛాంపియన్‌తో పోరుకు అర్హత సాధించాడు.
13రౌండ్ నుంచే హోరాహోరీ..
ఇక బుధవారం జరిగిన 13వ రౌండ్‌లోనే ఫలితం తేలాల్సి ఉన్నప్పటికీ ఈ గేమ్ రసవత్తరంగా సాగింది. 13వ రౌండ్ కూడా డ్రాగా ముగిసింది. దీంతో ఇరువురు ఆటగాళ్లు 6.56.5 పాయింట్లతో సమానంగా నిలిచారు. దీంతో గురవారం 14వ రౌండ్‌లో తలపడ్డారు. 13వ రౌండ్‌లో సుమారు 5 గంటలపాటు సాగింది. ఆటగాళ్లిద్దరూ పాయింట్‌ను పంచుకున్నారు. విజయం కోసం గుకేశ్ గట్టిగానే ప్రయత్నించాడు. కానీ, చైనా ఆటగాడు డింగ్ లిరెన్ ఆ అవకాశం ఇవ్వలేదు. దీంతో గేమ్ 68 స్టెప్స్ వరకూ వెళ్లింది. అయినా ఫలితం తేలకపోవడంలో గేమ్‌ను డ్రాగా ముగించేందుకు అంగీకరించారు. ఇక, 14వ రౌండ్‌లో అద్భుత ఆటతీరుతో ఓ పాయింట్ సాధించడంతో విజయం గుకేశ్‌ను వరించింది.
గుకేశ్ భావోద్వేగం..
ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ టైటిల్ గెలిచిన గుకేశ్ దొమ్మరాజు భావోద్వేగానికి లోనయ్యాడు. ఆట ముగిసిన అనంతరం అతడు మాట్లాడుతూ.. ‘ఈ టోర్నీ గెలవడంతో నా కల నెరవేరింది. ఇది 10 ఏళ్ల నిరీక్షణ. చాలా సంతోషంగా ఉంది. ఈ విజయంతో నా తల్లిదండ్రులు చాలా ఆనందంగా ఉన్నారు. ఈ గెలుపునకు వారి పోత్సాహం వర్ణించలేనిది. ప్రత్యర్థి అయినప్పటికీ డింగ్ లిరెన్ నిజమైన ఛాంపియన్. ఈ టోర్నీలో గెలిచినంత మాత్రనా నేనేమీ అత్యుత్తమ ఆటగాడిని కాదు. ప్రపంచ అత్యుత్తమ ఆటగాడు ఎప్పటికీ కార్ల్‌సన్ మాత్రమే’ అని గుకేశ్ పేర్కొన్నాడు.