Tuesday, November 5, 2024

గల్ఫ్ వలసలు ఎలా ఆపగలం?

- Advertisement -
- Advertisement -

బతుకు భారమై జీవనోపాధి కొరకు గల్ఫ్ దేశాలకు కార్మికులు వలసపోతున్నారు. అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలతో పోలిస్తే గల్ఫ్ దేశాలకు కార్మికుల వలస ఎక్కువగా వుందని వలస నిపుణుడు ‘ఇంటర్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ పాపులేషన్ సైన్సెస్ మైగ్రేషన్ అర్బన్ స్టడీస్ విభాగ అధిపతి ప్రొఫెసర్ ఆర్.బి భగత్ తమ అధ్యయనంలో తెలిపారు. గల్ఫ్ దేశాల వలస కార్మికుల్లో ఎక్కువ మంది దక్షిణ భారత దేశంలోని 5 రాష్ట్రాలైన కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుండి వచ్చినట్లు ప్రొఫెసర్ ఆర్.బి భగత్ పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉత్తర తెలంగాణలోని నిజామాబాద్, కరీంనగర్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, నిర్మల్, ఆదిలాబాద్, హైదరాబాద్ జిల్లాలలో ఉన్న యువకులు ఉపాధి కొరకు గల్ఫ్ దేశాలకు వలస వెళ్ళారు.

నాటి సమైక్య రాష్ట్రంలో (ఆంధ్రప్రదేశ్) ఏర్పడిన తీవ్ర కరువు కాటకాలు, వర్షాభావ పరిస్థితులు, వాటికి తోడు నాటి ప్రభుత్వాలు అవలంబించిన ప్రాంతీయ వివక్ష సగటు తెలంగాణ యువకులను గల్ఫ్ వైపు చూసేలా చేశాయి. తెలంగాణలోని పలు జిల్లాల్లో ప్రతి ఊరిలో గల్ఫ్ కార్మికులున్నారు. భూమి లేని సామాజికంగా బలహీన వర్గాల కుటుంబాల నుండి గల్ఫ్ వలసలు ఎక్కువ వున్నాయి. వ్యవసాయానికి భూమి లేక, కూలీలు లభించక, పండిన పంటకు గిట్టుబాటు ధర లేక, సాగు నీరు లేక ఎలాంటి పని దొరకని స్థితిలో, వున్న భూమిని అమ్ముకొని ఏజెంట్ల మాయమాటల్లో పడి ఉచితంగా వచ్చే వీసా కోసం లక్షలు ఖర్చు చేసి అప్పుల పాలై ఏజెంట్ల మోసాలకు బలై ఆర్థికం గా దివాలా తీసిన కుటుంబాలు ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి. తల్లి, భార్యా పిల్లలను వదిలి గల్ఫ్ దేశాలకు వలస వెళ్ళిన యువత దుర్భర జీవితాలను వెళ్లదీస్తున్నారని అనేక సర్వేల్లో తేలింది.
గల్ఫ్ దేశాల కార్మిక చట్టాల మీద అవగాహన లేకపోవడం వల్ల కార్మికుల చేత కంపెనీలు తక్కువ వేతనాలకు ఎక్కువ పని గంటలు పని చేయించుకొని శ్రమ దోపీడీకి పాల్పడుతున్నాయి.

పోలీసుల రైడింగుల్లో పట్టుబడి చేయని నేరానికి జైళ్ళలో మగ్గుతున్న అనేక మంది కార్మికులు దుర్భర జీవితాలను గడుపుతున్నారు. వారికి ఎలాంటి న్యాయ సహాయం అందడం లేదు. దేశంలో బతుకు తెరువు కోసం గల్ఫ్ దేశాలకు వలస వెళ్ళే కార్మికుల సంఖ్య తగ్గలేదు. గల్ఫ్ బాధిత కుటుంబాల సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదు. గల్ఫ్ దేశాల్లో పని చేయటానికి భారత దేశం నుండి వెళ్లిన కార్మికుల్లో తెలంగాణ రాష్ట్రానికి చెందినవారే ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. ఉత్తర తెలంగాణ జిల్లాలైన కరీంనగర్, నిజామాబాద్, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లా లో దాదాపు ప్రతి ఇంటికి ఒకరు గల్ఫ్ దేశాలకు వలస వెళ్లిన కుటుంబాలు వున్నాయి. హైదరాబాద్ నుండి కూడా తప్పనిసరి పరిస్థితుల్లో గల్ఫ్ కు వలస వెళ్లే యువత ఎక్కువ మంది వున్నారు.

బతుకు పోరాటంలో గల్ఫ్ దేశాలకు వలస వెళ్లిన వారి వివరాలు విదేశీ మంత్రిత్వ శాఖ ఇటీవల విడుదల చేసింది. 2021 జనవరి నుండి అక్టోబర్ వరకు, 2022 జనవరి నుండి అక్టోబర్ వరకు గల్ఫ్ దేశాలకు వలస వెళ్లిన వారి వివరాలు తెలియచేసింది. 2022 జనవరి నుండి అక్టోబర్ నాటికి 9576 మంది కార్మికులు 9 గల్ఫ్ దేశాలకు వలస వెళ్లారు. వీరి సంఖ్య 2021 జనవరి నుంచి అక్టోబర్ నాటికి 4375 మంది మాత్రమే వలస వెళ్లగా, 2022 నాటికి వీరి సంఖ్య రెట్టింపు కావడం గమనార్హం. గల్ఫ్ దేశాలకు జరిగే వలసలు కొనసాగుతూనే వున్నాయి. కొత్తగా మలేషియాకు కూడా వలసలు పెరిగాయి. 104 మంది కొత్తగా ఉపాధికి వెళ్లినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

అంతేగాకుండా ‘టూరిస్ట్ వీసా’ మీద ఉపాధి కొరకు అధిక సంఖ్యలో వెళ్లినట్లు స్వచ్ఛంద సంస్థల సర్వేల్లో వెల్లడైంది. ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు కల్పన ఆశించిన మేరకు లేక పోవడం వల్ల గల్ఫ్‌కు వలసలు ఆగలేదు. ఉపాధి అవకాశాలు పెరిగాయని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నప్పటికీ దేశంలో పేదరికం, నిరుద్యోగం, బాల కార్మికులు ఆర్థిక అసమానతలు, ప్రకృతి వైపరీత్యాలు, కరువులు, పంటలకు గిట్టుబాటు ధరలు లేకపోవడం, గ్రామీణ చే తివృత్తుల క్షీణత, ఆర్థిక అవసరాల పెరగడం వల్ల గల్ఫ్ దేశాలకు వలస వెళ్ళక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి. కరోనా మహమ్మారి దెబ్బకు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, ఆరోగ్య వ్యవస్థ కుదేలయ్యాయి. కరోనా ప్రభావం వల్ల గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న తెలంగాణ రాష్ట్ర కార్మికులు బిక్కుబిక్కుమంటూ జీవితాలను వెళ్లబుచ్చుతున్నారు. పలు కంపెనీలు లాక్ డౌన్ ప్రకటించడం వల్ల చాలా మంది కార్మికులు ఉపాధి కోల్పోయారు. రవాణా సౌకర్యాలు మందగించడం వల్ల సొంత ప్రాంతాలకు రాలేక కార్మికులు దుర్భర పరిస్థితుల్లో జీవితాలు వెళ్లదీస్తున్నారు.

ఇటీవల విమాన రవాణా సౌకర్యాలు మెరుగుపడడం వల్ల గల్ఫ్ దేశాలకు వలస వెళ్ళే కార్మికుల సంఖ్య పెరిగింది. వలస కార్మికుల సంక్షేమం పట్ల ఆయా దేశాల ప్రభుత్వాలు శ్రద్ధ వహించక పోవడం శోచనీయం బహ్రెయిన్, ఒమన్ దేశాల్లో పని చేస్తున్న వలస కార్మికులను పట్టించుకునే నాథుడే లేడు. ఆ దేశాల్లో అనేక కేసుల్లో మన దేశ కార్మికులు జైలు జీవితం గడుపుతున్నారు. గల్ఫ్ దేశాలకు వలస వెళ్లే కార్మికుల్లో నిజామాబాద్, హైదరాబాద్, కరీంనగర్ ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానంలో వున్నాయి. గల్ఫ్ దేశాలైన బహ్రెయిన్, ఇరాక్, జోర్డాన్, కువైట్, ఒమన్, మలేషియా, సౌదీ అరేబియా, ఖతార్ మొదలగు తొమ్మిది దేశాలకు వలస వెళ్లిన కార్మికులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు.

ప్రైవేట్ ఏజెంట్‌ల ద్వారా వెళుతున్న వారి సంఖ్య కచ్చితంగా తెలియడం లేదు. ఇమ్మిగ్రేషన్ క్లియరెన్స్ రిక్వెస్ట్ ద్వారా 10వ తరగతి కంటే తక్కువ చదువుకున్న కార్మికుల వివరాలను ప్రభుత్వం సేకరిస్తుంది. ఇమ్మిగ్రేషన్ క్లియరెన్స్ నాట్ రిక్వెస్ట్ కింద వెళ్ళే వారి సంఖ్య వివరాలు ప్రభుత్వం వద్ద లేవు. 10వ తరగతి కంటే ఎక్కువ విద్యార్హతలు వుండి, గతంలో 3 యేళ్ల పాటు పని చేసిన వారు, ఐటి రిటర్న్ దాఖలు చేసిన వారికి ఇసిఆర్ కింద వీసాలు జారీ చేస్తారు. టూరిస్ట్ వీసా కింద వెళ్ళే కార్మికుల వివరాలు ప్రభుత్వం వద్ద లేవు. తెలంగాణ ఆవిర్భావం నుండి ఎన్‌ఆర్‌ఐ పాలసీని గల్ఫ్ దేశాల కార్మికులకు వర్తింప చేయమని గల్ఫ్ కార్మికులు కోరుతున్నారు. 2016 సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం గల్ఫ్ దేశాలకు వలసలు అరికట్టడానికి సాధారణ పరిపాలన శాఖ ఎన్‌ఆర్‌ఐ సెల్ ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసింది. ప్రైవేట్ ఏజెంట్ల బారినపడకుండా, వారి మోసాలను అరికట్టడానికి ప్రభుత్వమే మాన్ పవర్ కంపెనీ లిమిటెడ్ (ఏజెన్సీ) ను నెలకొల్పింది.

నేదునూరి కనకయ్య
9440245771

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News