తెలంగాణ నుంచి ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లిన వారికోసం
ప్రత్యేకంగా ఒక గల్ఫ్ పాలసీని తీసుకువస్తాం..
సిరిసిల్ల రోడ్ షోలో మంత్రి కెటిఆర్ ప్రకటన
మనతెలంగాణ/హైదరాబాద్ : ఇప్పటికే అన్ని వర్గాల సంక్షేమం కోసం పలు కార్యక్రమాలు ప్రకటించిన భారత రాష్ట్ర సమితి ఆదివారం మరో కీలకమైన అంశం పైన ప్రకటన చేసింది. తెలంగాణ రాష్ట్రం నుంచి ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లిన వారికోసం ప్రత్యేకంగా ఒక గల్ఫ్ పాలసీని తీసుకువస్తామని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కె.టి. రామారావు ప్రకటించారు.
అధికారంలోకి రాగానే నూతన సంవత్సరం జనవరిలో గల్ఫ్ పాలసీని అమలులోకి తీసుకువస్తామని వెల్లడించారు. ప్రధానంగా గల్ఫ్‌లో ఉపాధి కోసం వెళ్లిన వారికి సైతం గల్ఫ్ బీమా కార్యక్రమాన్ని అమలు చేస్తామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న రైతు బీమా మాదిరిగా రానున్న ప్రభుత్వంలో గల్ఫ్ ప్రవాసీలకు కూడా భీమా అందిస్తామని పేర్కొన్నారు. ఈ గల్ఫ్ బీమా పథకం కింద ప్రతి ఒక్క వ్యక్తికి రూ. 5 లక్షల బీమా కవరేజ్ అందుతుందని తెలిపారు. గల్ఫ్ పాలసీలో భాగంగా ఇతర సంక్షేమ కార్యక్రమాలను కూడా కలిపి సమగ్రమైన పాలసీని అమలులోకి తీసుకువస్తామని చెప్పారు. ఈ మేరకు కెటిఆర్ తన సిరిసిల్ల రోడ్ షోలో ప్రకటన చేశారు.