Thursday, December 26, 2024

అప్రమత్తతే శ్రీరామరక్ష!

- Advertisement -
- Advertisement -

అమెరికాలో భారతీయులు, భారతీయ మూలాలున్నవారి అనుమానాస్పద మరణాలు కలవరం కలిగిస్తున్నాయి. ఇలా మృత్యువాత పడుతున్న వారిలో అక్కడి యూనివర్శిటీల్లో సీటు సంపాదించుకుని, భవిష్యత్తుపై కొండంత ఆశతో పరాయి దేశం చేరిన విద్యార్థులే ఎక్కువ మంది కావడం గమనార్హం. ఈ ఏడాది ఆరంభం నుంచే మొదలైన ఈ అనుమానాస్పద మరణాల పరంపర మూడున్నర నెలలుగా కొనసాగుతూనే ఉంది. జనవరి 16న వివేక్ సైనీ అనే పాతికేళ్ల వయసున్న విద్యార్థి మాదకద్రవ్యాలకు బానిసైన ఒక వ్యక్తి చేతిలో దారుణ హత్యకు గురయ్యాడు.

అది మొదలు నీల్ ఆచార్య, సమీర్ కామత్, శ్రేయాస్ రెడ్డి బెనిగెరి, అకుల్ ధవన్, వివేక్ తనేజా తదితరులు దేశం కాని దేశంలో అనూహ్యమైన పరిస్థితుల్లో కన్నుమూశారు. వాషింగ్టన్ యూనివర్శిటీలో చదువుకుంటున్న అమర్ నాథ్ ఘోష్‌ను ఫిబ్రవరి 27న దుండగులు సెయింట్ లూయీలో దారుణంగా కాల్చి చంపారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన అమర్ నాథ్ పేరున్న శాస్త్రీయ నృత్య కళాకారుడు కూడా. బోస్టన్ యూనివర్శిటీ విద్యార్థి అయిన తెలుగు కుర్రాడు అభిజిత్ పరుచూరు (20) మృతదేహం అడవిలో ఒక కారులో లభ్యమైంది. ఈ దుస్సంఘటనలు.. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామిక దేశాలైన అమెరికా, భారతదేశాల మధ్య మైత్రీ బంధాన్ని సహజంగానే ప్రశ్నార్థకంలో పడవేస్తున్నాయనడంలో సందేహం లేదు. భారతీయ విద్యార్థులనే లక్ష్యంగా చేసుకుని సాగుతున్న ఈ మారణ కాండ అగ్రరాజ్యం అధ్యక్షుడి దృష్టికి రాకపోలేదు. ‘ఒక దేశాన్ని లేదా వర్ణాన్ని లేదా మతాన్ని లక్ష్యంగా చేసుకుని హింసకు పాల్పడటాన్ని అమెరికా సహించదు. వీటిని ఉక్కుపాదంతో అణచివేస్తాం’ అంటూ వైట్ హౌస్‌లో భద్రతా మండలి వ్యూహాత్మక కమ్యూనికేషన్ల సమన్వయకర్త జాన్ కిర్బీ ఖండించినా, హత్యాకాండ మాత్రం ఆగలేదనడానికి అమర్ నాథ్ ఘోష్ విషాదాంతమే నిదర్శనం.

అమెరికాలో సగటున రోజుకో భారతీయుడి మరణవార్త వినాల్సి వస్తోందని లాభాపేక్ష రహిత స్వచ్ఛంద సంస్థ ‘టీమ్ ఎయిడ్’ వ్యవస్థాపకుడు మోహన్ నన్నపనేని చేసిన వ్యాఖ్యలు పరిస్థితి తీవ్రతకు అద్దం పట్టేవే. గత రెండు దశాబ్దాలుగా అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, బ్రిటన్ వంటి దేశాలకు వలస వెళ్లే భారతీయుల సంఖ్య బాగా పెరిగింది. విద్య, ఉద్యోగావకాశాలను వెతుక్కుంటూ ఇలా వెళ్లినవారిలో చాలా మంది అక్కడే స్థిరపడుతున్నారు. భారత దేశం నుంచి ఏటా 25 లక్షల మంది విదేశాలకు వలస వెళ్తున్నట్లు అంచనా. సహజంగా చదువులో ముందుండే భారతీయ విద్యార్థులు అక్కడి వాతావరణ పరిస్థితులకు, సంస్కృతీ సంప్రదాయాలకు కొన్ని రోజుల వ్యవధిలోనే అలవాటు పడుతున్నారు.

కానీ కొందరు మాత్రం విదేశాలలో సర్దుకుపోలేక, స్వదేశానికి తిరిగి వెళ్లలేక బలహీనమైన క్షణంలో ఆత్మహత్యల వంటి తీవ్రమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. భారతీయ విద్యార్థుల అనుమానాస్పద మరణాలపై అక్కడి పోలీసుల స్పందన అరకొరగా ఉందన్న ఆరోపణలూ ఉన్నాయి. ఇండియానా రాష్ట్రంలోని పర్ద్యూ యూనివర్శిటీలో రెండేళ్ల వ్యవధిలో ముగ్గురు భారతీయ విద్యార్థులు అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించారు. వీరిలో వరుణ్ మనీష్ అనే విద్యార్థిని కొరియాకు చెందిన సహ విద్యార్థే హత్య చేయగా, మిగతా రెండు సంఘటనల్లోనూ పోలీసుల వైఖరి నిర్లక్ష్యపూరితమనే విమర్శలు వినవచ్చాయి. అమెరికాకు వెళ్లే విద్యార్థులలో భారతీయులు, చైనీయులు ఎక్కువ. తమ దేశానికి వచ్చి తమ ఉపాధి అవకాశాలు కొల్లగొడుతున్నారనే దుగ్ధ అక్కడి విద్యార్థులలో లేకపోలేదు.

తుపాకీ సంస్కృతి పెచ్చుమీరిన అమెరికాలోని యూనివర్శిటీల్లో భద్రత కూడా అంతంత మాత్రమే. భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం 2018- 2023 మధ్య కాలంలో విదేశాల్లో 403 మంది భారతీయ విద్యార్థులు మరణించారు. ఈ నేపథ్యంలో ప్రముఖ పారిశ్రామికవేత్త ఇంద్రానూయీ చెప్పిన హితోక్తులను చెవికెక్కించుకోవడం యువతరానికి అత్యంత ఆవశ్యకం. తమ వీసా స్టేటస్ గురించి, విదేశీ విద్యార్థిగా తమకున్న పరిమితులగురించి గుర్తెరిగి మసలుకోవాలంటూ ఆమె చేసిన సూచనలు శిరోధార్యం. సోషల్ మీడియా పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ, రాత్రివేళల్లో ఒంటరిగా చీకటి ప్రదేశాల్లో తిరగడం, అతిగా మద్యం సేవించడం వంటివి తగదని హితవు చెప్పారామె. ఉపాధి అవకాశాలకు స్వర్గధామంగా అమెరికాను అభివర్ణించడం కద్దు. అయితే నాణేనికి ఒక వైపున్న బొమ్మను మాత్రమే చూస్తున్న యువత దాని వెనుకనే ఉన్న బొరుసును మాత్రం ఉపేక్షిస్తోంది. అమెరికాలో తుపాకీ సంస్కృతి, మితిమీరిన మాదకద్రవ్యాల వాడకం, వర్ణ వివక్ష, విదేశీయులపై విద్వేషభావం కూడా ఎక్కువేనన్న సంగతిని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు గ్రహించి తదనుగుణంగా మసలుకుంటేనే అందరికీ శ్రీరామరక్ష!

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News