Monday, November 25, 2024

ఎటిఎంలో పేలిన తూటా

- Advertisement -
- Advertisement -

డబ్బులు నింపుతుండగా సిబ్బందిపై దుండగుల కాల్పులు, ఒకరు మృతి
 రూ.5లక్షలతో పరారీ, నిందితుల పట్టివేత

 హైదరాబాద్ కూకట్‌పల్లిలో ఘటన

మనతెలంగాణ/సిటిబ్యూరోః ఎటిఎం సిబ్బందిపై దుండగులు కాల్పులు జరిపిన సంఘటన నగరంలో కలకలం సృష్టించింది. దుండగుల కాల్పుల్లో ఎటిఎం సెక్యూరిటీ గార్డు మృతిచెందగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటన కూకట్‌పల్లిలోని పటేల్‌కుంట పార్క్ వద్ద ఉన్న హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఎటిఎం వద్ద గురువారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం…. సిఆర్‌పిఎఫ్ మాజీ జవాన్ అలీబేగ్, శ్రీనివాస్, మరో వ్యక్తి కలిసి హెడ్‌డిఎఫ్‌సిబ్యాంక్ ఎటిఎంలలో డబ్బులు నింపేందుకు వచ్చారు. ముందుగా కూకట్‌పల్లిలోని ఎటిఎంలో డబ్బులు నింపిన వారు మద్యాహ్నం 1.45గంటలకు పటేల్‌కుంట వద్ద ఉన్న ఎటిఎంలో డబ్బులు నింపేందుకు వచ్చారు. ఈ క్రమంలో సిబ్బంది ఇద్దరు ఎటిఎంలో డబ్బులు నింపేందుకు లోపలికి వెళ్లగా, సెక్యూరిటీ సిబ్బంది అలీబేగ్ డబ్బులు తీసుకువచ్చిన వాహనంలో తుపాకిని పెట్టి వారికి సాయం చేస్తున్నాడు. ఇలోపే పల్సర్ బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు డబ్బులు దోచుకునేందుకు యత్నించారు. దీనిని హెడ్‌డిఎఫ్‌సి బ్యాంక్ సిబ్బంది అడ్డుకునేందుకు యత్నించగా నాటు తుపాకితో కాల్పులు జరిపారు. వెంటనే సిబ్బంది వద్ద ఉన్న రూ.5లక్షలు తీసుకుని పారిపోయారు. శ్రీనివాస్, అలీబేగ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరిని స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించగా అలీబేగ్ మృతిచెందాడు, శ్రీనివాస్ చికిత్స పొందుతున్నాడు. శ్రీనివాస్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు రెండు బుల్లెట్లు, బుల్లెట్ లాక్‌ను స్వాధీనం చేసుకున్నారు. విషయం తెలుసుకున్న సైబరాబాద్ సిపి విసి సజ్జనార్, క్రైం ఇన్‌చార్జ్ డిసిపి ఎస్‌ఎం విజయ్‌కుమార్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. క్లూస్ టీం పలు ఆధారాలు సేకరించారు.

బయటి వారిపనేః విసి సజ్జనార్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్
దోపిడీకి పాల్పడిన వారు వేరే రాష్ట్రాలకు చెందిన నిందితులుగా అనుమానిస్తున్నామని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ అన్నారు. నిందితులు కంట్రీ మేడ్ రివాల్వర్‌తో కాల్పులు జరిపారని తెలిపారు. నిందితులు కాల్పులు జరిపిన తీరు చూస్తే, ఇద్దరు వ్యక్తులు ప్రొఫెషనల్స్‌గా తెలుస్తోందని అన్నారు. నిందితులను పట్టుకునేందుకు ఆరు టీములను ఏర్పాటు చేశామని తెలిపారు. ఎస్‌ఓటి, లా అండ్ ఆర్డర్ పోలీసులతో కలిసి ఏర్పాటు చేశామని తెలిపారు. సంఘటన స్థలంలో దొరికిన ఆధారాలతోపాటు సిసి కెమెరాల ఫుటేజ్ ఆధారంగా దుండగుల కోసం గాలింపు చేపట్టామని తెలిపారు. డబ్బులు తీసుకున్న తర్వాత నిందితులు భాగ్యనగర్ వైపు పారిపోయినట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News