తాబేలు కూడా నడుస్తుంది. కాకపోతే మనకు తొందర ఉంది గదానని అది తొందరగా నడవదు. దాని వేగం దానిది. రష్యాఉక్రెయిన్ యుద్ధం విషయమై కాల్పుల విరమణ చర్చలు ముందుకు సాగుతున్నాయి గాని, తాబేలు నడక వలె. ఇది కాల్పుల విరమణకే గాని యుద్ధ విరమణకు కాదు. కాల్పుల విరమణ అయినా సంపూర్ణ స్థాయిలో కాదు, పాక్షికంగా మాత్రమే. సమస్య ఏమంటే కాల్పుల విరమణ పాక్షికంగా కాక సంపూర్ణంగా జరగాలని, యుద్ధ విరమణ కూడా జరగాలని, ఇవన్నీ సత్వరమే జరిగిపోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ చాలా ఆతృత పడుతున్నారు. కాని రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు అటువంటి తొందర పాటేమీ లేదు. ఆలస్యాలు జరిగినా పరవలేదుగాని, వీలైనంత వరకు అన్నీ తాను కోరుకున్నట్లు జరగాలన్నది ఆయన ఆలోచన లేదా వ్యూహం.
అమెరికా ప్రతినిధులు సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లో రష్యా, ఉక్రెయిన్ ప్రతినిధులతో చర్చల తర్వాత ఈ నెల 25న చేసిన కాల్పుల విరమణ ప్రకటనలను పరిశీలించినపుడు, ఇదే పరిస్థితి కనిపిస్తుంది. చర్చలోకి వెళ్లేముందు, 25న జరిగిందేమిటో చూద్దాము. అమెరికా ప్రతినిధులు రష్యా, ఉక్రెయిన్ ప్రతినిధులతో కలిసి కూర్చుని గాక, వారు వేర్వేరు గదుల్లో ఉండగా ఆగదుల మధ్య తిరుగుతూ విడివిడిగా మాట్లాడారు. ఈతరహా చర్చలను షటిల్ డిప్లమసీ అంటారు. ఆ విధమైన చర్చల అనంతరం, అంగీకారం కుదిరిన అంశాలపై సంయుక్త ప్రకటన వెలువడ గలదని మొదట భావించారు. కాని, అమెరికారష్యా కలిసి ఒక ప్రకటన, అమెరికాఉక్రెయిన్ కలిసి మరొకటి విడుదల చేసాయి. చర్చల సాఫీగా నడవటం లేదని దానితోనే అర్థమైంది. అదే సమయంలో అందుకు ఇతరత్రా తగు కారణాలున్నాయి.
అవేమిటో తర్వాత చూద్దాము. ప్రకటనలలోని అంశాలు విషయానికి వస్తే, ఇంధన సదుపాయాలపై 11న, పుతిన్ 18న అంగీకరించడటం తెలిసిందే. అది ఇంకా అమలు కైతే రాలేదు గాని, ఆ ఒప్పందం నల్ల సముద్రంలోని నౌకా రవాణాకు కూడా వర్తించాలని జెలెన్‌స్కీ కోరగా ట్రంప్ ఆ విషయాన్ని ముందుకు తెచ్చారు. అందుకు రష్యా ఇపుడు అంగీకారం తెలిపింది. అనగా, పాక్షిక కాల్పుల విరమణలు ఇరుదేశాల లోని ఇంధన సదుపాయాలకు, నల్ల సముద్రంలో నౌకామార్గానికి వర్తిస్తాయన్న మాట. అట్లాగే నీటి ప్రాజెక్టులకు ఆ మేరకు రియాద్ చర్చలు ముందడుగు అవుతున్నాయి. కాని ఈ అంగీకారాలు ఇంకా సంపూర్ణం కాదు. ఎందుకంటే, విరమణ అమలు ఎప్పటి నుంచి? అమలును పర్యవేక్షించే యంత్రాంగం ఏమిటి? అన్న వివరాలు ఏ ప్రకటనలోనూ లేవు.
తన వైపు నుంచి అమెరికా కూడా చెప్పలేదు. అమలు వెంటనే మొదలు కావా లి, అవుతుందని తర్వాత జెలెన్‌స్కీ ప్రకటించగా పుతిన్ ఈ నెల 18న ట్రంప్‌తో మాట్లాడిన తేదీని ఖరారు చేయాలని ర ష్యా అంటున్నది. ఒప్పంద పర్యవేక్షణకు యంత్రాంగం లేకు న్నా తాము ఉల్లంఘనలు జరిగినపుడు అమెరికా దృష్టికి తీసుకు వెళ్ల గలమని జెలెన్‌స్కీ అన్నారు. రష్యా వైపు నుంచి ఏ సూచనా లేదు. అమెరికా కూడా స్పందించవలసి ఉంది. దీనంతటిని బట్టి అర్ధమయేదేమిటి? మొదటి అనుకున్న తాబేలు నడకపోలిక గుర్తుకు వస్తుంది. యుద్ధంలో తీవ్రంగా నష్టపోతున్న జెలెన్‌స్కీ కి అన్నీ త్వరగా జరిగిపోవాలని ఉంది. పై చేయిగా ఉన్న పుతిన్, వీలైనన్ని సాధించుకుంటూ ఆ పని చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ట్రంప్‌కు తొందర అయితే ఉంది గాని, పుతిన్ తొందర పెట్టే స్థితిలో లేరు. ఈ పరిస్థితులన్నీ ఈ మార్చి 25 నాటి ప్రకటనలు వివరాలలోనూ కనిపిస్తాయి. ముందుగా ఇంధన సదుపాయాలపై దాడుల విషయం చూద్దాము.
యుద్ధం మొదలైన మూడేళ్ల కాలంలో ఉక్రెయిన్ విద్యుత్ సదుపాయాలలో దాదాపు 80 శాతాన్ని రష్యా ధ్వంసం చేసిందన్నది ఒక అంచనా, వాటిని ఎప్పటికపుడు యూరప్ సహాయంతో బాగు చేయించుకుంటున్నారు గాని, అయినా ఆ వ్వవస్థ మాత్రం భారీగా నష్టపోయిన స్థితిలోనే ఉన్నది. ఈ దాడులు ఆగాలన్నది మార్చి 11,18 తేదీల నాటి సంభాషణలలోని అంశం. అందుకు ఇపుడు లిఖిత రూపం వచ్చింది. కాని ఇందులో ఒక మెలిక ఉంది. రష్యా దాడుల తమ ఇంధన వసతులతో పాటు ఇతర మౌలిక సదుపాయ నిర్మాణాలపై కూడా ఆగ గలవనే నిర్వచనాన్ని జెలెన్‌స్కీ ఇవ్వగా, ఇతర నిర్మాణాలకు వర్తించదని రష్యా స్పష్టం చేసిం ది. అందుకు జెలెన్‌స్కీ ఏమీ చేయలేక పోయారు. ట్రంప్ మౌనంగా ఉండి పోయారు. ఆ అంశాన్ని ఇపుడు రియాద్‌లో ముందుకు తెచ్చేందుకు ఉక్రెయిన్ ప్రయత్నించింది. కాని ఆ ప్రస్తావన ప్రకటనలలో లేదు, రష్యా నుంచి లేదు, అమెరికా నుంచి లేదు. అనగా, విద్యుత్తు తో నిమిత్తం లేని ఇతర రంగాల నిర్మాణాలపై దాడుల సాగవచ్చునన్న మాట.
గమనించదగినదేమంటే, రష్యా ఈ వెసులుబాటును ఉంచుకుంటూనే ఇదే ఒప్పందంలో తన కోసం ఒకటి సాధించుకుంది. ఇటీవల ఉక్రెయిన్ రష్యాకు చెందిన చమురు సదుపాయాలపై కొన్ని డ్రోన్ దాడులు జరిపి నష్ట పరిచింది. ఆ దాడులను కొనసాగిస్తామన్నది. వాటిని రష్యా పూర్తిగా నిలువరించలేకపోతున్నది. రష్యా ఆదాయం గణనీయంగా చమురు రంగం నుంచి లభిస్తున్నందున దానిని దెబ్బ తీసినట్లయితే రష్యా యుద్ధయంత్రాంగం కుంటుపడ గలదన్నది ఉక్రెయిన్ అంచనా. అదెట్లున్నా, ఉక్రెయిన్ విద్యుత్ వ్వవస్థపై దాడుల నిలిపి వేతకు ప్రతిగా తమ చమురు ఇంధన వ్యవస్థపై ఎదురుదాడులు నిలిచేందుకు పుతిన్ ఈ ఒప్పందంతో ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దాడుల నిలిపివేత ఇంధన మౌలిక సదుపాయాలు, చమురు శుద్ధి కర్మాగారాలు, గ్యాస్ పైప్‌లైన్లు, ఇంధన నిలువ సదుపాయాలకు వర్తించాలన్నది రష్యా షరతు. మొత్తానికి ఇది అమలుకు రావటం రెండు దేశాలకూ ఉపయోగకరం అవుతుంది. ఒప్పందం అమలు వ్యవస్థలను అమెరికా త్వరలోనే సిద్ధం చేయవచ్చు.
రెండవ అంశం నల్ల సముద్రంలోనూ కాల్పుల విరమణ. రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య గల ఆ సముద్రం నౌకా రవాణాకు ఉభయులకూ కీలకమైనది. అయితే ఆ సముద్రంలో గల క్రిమియా 2014 నుంచి రష్యా అధీనంలో ఉంది. రష్యా యుద్ధ నౌకలున్నాయి. అందువల్ల ఆ సముద్రం మీదుగా ధాన్యం తదితరాల రవాణాను ఉక్రెయిన్ స్వేచ్ఛగా చేయలేకపోతున్నది. ఉక్రెయిన్ రేవులను, నౌకలను రష్యా ఎప్పుడైనా దిగ్బంధం చేయగలదు. అయితే, ఉక్రెయిన్ నౌకలలో ఆయుధ రవాణా జరగకుండా తనిఖీలు చేసి అనుమతించేందుకు ఐక్యరాజ్యసమితి వత్తిడితో రష్యా 2022లో ఉక్రెయిన్‌తో ఒప్పందానికి రాగా, అది మరుసటి సంవత్సరం విఫల మైంది. అదే ఒప్పందాన్ని ఇపుడు పునరుద్ధరించనున్నారు. తిరిగి అదే షరతులతో. విశేషమేమంటే తనవైపు నుంచి అ రాయితీని కల్పిస్తున్న రష్యా, ఇంధన వనరులపై దాడి విషయంలో వలెనే ఇందులోనూ తనకు కావలసింది రాబట్టుకుంటున్నది. అది, ప్రస్తుత యుద్ధం దరిమిలా తమపై అమెరికా విధించిన ఆర్థిక ఆంక్షలు కొన్ని ఎత్తి వేయటం అంతర్జాతీయ మార్కెట్లులో తమ ధాన్యం విక్రయానికి వీలు. అందుకోసం తమ వ్యవసాయ సంబంధిత బ్యాంకులు, బీమా కంపెనీలు, ఇతర కంపెనీలు, రేవుల నౌకలు మొదలైన వాటిపై ఆంక్షల రద్దు. అట్లాగే, స్విఫ్ట్ వ్యవస్ధ ద్వారా అంతర్జాతీయంగా నిధుల బదిలీకి మళ్లీ అవకాశం ఉండటం. అయితే, స్విఫ్ట్‌కు సంబంధించి యూరోపియన్ యూనియన్ ఆమోదం కూడా అవసరం. అది ట్రంప్ సాధించగలదే అయినా ఎంత సమయం పడుతుందో తెలియదు. గుర్తించవలసిందేమంటే, ఇదంతా జరిగితే గాని కాల్పుల విరమణ ముందుకు సాగబోదని రష్యా స్పష్టం చేసింది. ఈ రెండూ గాక యుద్ధ ఖైదీల విడుదల వంటి సాధారణ అంశాలు కొన్నున్నాయి.
ఇంత చేసీ ఇది తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం. కేవలం నెలరోజుల కోసం. ఈ కాలంలో పెద్ద ఉల్లంఘనలు లేనట్లయితే పొడిగింపులు ఉంటాయి. ఈ సమయాన్ని వినియోగించుకుని దీర్ఘకాలిక కాల్పుల విరమణ ఒప్పందానికి మూడు వైపుల నుంచి ప్రతిపాదనలు తయారవుతాయి. అం దుకు ముఖ్యంగా రష్యా, ఉక్రెయిన్ షరతులేమిటో స్థూలంగా ప్రచారంలోకి వచ్చినవే. చర్చలు నేరుగా జరిగినపుడు నిర్ధిష్ట రూపంలో ముందుకు వస్తాయి. అవి ఎప్పటికి ఏ విధంగా తేలితుంది ఒప్పందం జరిగేదీ ఎవరూ చెప్పలేరు. ట్రంప్ వైఖరి మాత్రం రష్యాకు అనుకూలంగా ఉందనే అభిప్రాయం ఇప్పటికే అందరికీ ఏర్పడిపోయింది. ఉక్రెయిన్ బలహీనతలు, ఆ దేశాన్ని గట్టిగా బలపరుస్తున్న యూరప్ నిస్సహాయ స్థితి కూడా అందరికీ అర్ధమయ్యాయి. దీనంతటి మధ్య అమెరికా అధ్యక్షుడు తమ కోసం తేల్చుకోవలసి ఉన్నది. ఉక్రెయిన్‌లోని ఖనిజాలు, ఇంధన వనరులలో తాము ఎంత సాధించుకోవచ్చును, రష్యా నుంచి ఏమి లాభ పడవచ్చు నన్నదే. ఆ విధంగా విషయం ఏదో ఒక నాటికి సకల తారకంగా ముగియవచ్చునా? ప్రస్తుతానికి మాత్రం తాబేలు మరొక అడుగు ముందుకు వేసింది. మరొకి వైపు యుద్ధం మరికొంత కాలం సాగుతూనే ఉంటుంది. దీర్ఘకాలిక కాల్పుల విరమణకు వరకు. ఆలోగా ఉక్రెయిన్ సేనలను రష్యా కుర్‌స్క్ నుంచి వెడలనంపటం వరకు ఖాయం. దోన్ బాస్ ప్రాంతాన్ని ఇంకా ఎంత ఆక్రమించగలరన్నది ప్రశ్న. ఆ విధంగా చర్చల తాబేలు నడకే పుతిన్‌కు లాభాదాయకమన్నమాట.
ఇదిట్లుండగా, అమెరికా ఉపసంహరించుకున్నప్పటికీ ఉక్రెయిన్‌కు పూర్తి మద్దతు ఇవ్వగలమంటూ యూరోపియన్ దేశాలు తమ హడావుడిని కొససాగిస్తూనే ఉన్నాయి. ఇప్పటికి శిఖరాగ్ర సమావేశాలు, సైన్యాధికారుల సమావేశాలు అరడజను దాకా జరిపాయి. రక్షణ వ్యయాలు గణనీయంగా పెం చటం, అమెరికాకు దీటు రాగల ఆయుధ వ్యవస్థల అభివృద్ధి, ఉమ్మడిగా యూరోపియన్ సైన్యం తయారీ, ఉక్రెయిన్‌కు శాంతి దళాలను పంపటం వంటి మాటలు అనేకం చెప్తున్నారు. అదే సమయంలో అమెరికాను తిరిగి తమ దారికి తె చ్చుకోగలమని కూడా అంటున్నారు. అ అన్ని విషయాలపై యూరప్‌లో చర్చలు, ఇవన్నీ సాధ్యం కాని వనే విమర్శలు ముమ్మరంగా సాగుతున్నాయి. ప్రత్యామ్నాయ రక్షణ వ్యవస్థలనే వాదనలకు నాయకత్వం బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ లది. వారిలో ఇటలీ, స్పెయిన్ మొదలైనవి ఏకీభవించటం లేదు. సమాంతర పరిణామాలూ గమనించదగ్గవే అవుతున్నాయి.
టంకశాల అశోక్
దూరదృష్టి