హోస్టన్: అమెరికాలో మరోసారి తుపాకీ కాల్పులు కలకలం సృష్టించాయి. ఓ మాల్‌లో దుండగుడు విచక్షణా రహితంగా జరిపిన కాల్పుల్లో చిన్నారులు సహా 8 మంది మృతి చెందారు. మరో ఏడుగురు గాయపడ్డారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. టెక్సాస్ రాష్ట్రం డల్లాస్ నగర శివారు అలెన్‌లోని మాల్‌లో శనివారం ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనతో అమెరికా మరోసారి ఉలిక్కి పడింది. వారాంతపు షాపింగ్ కోసం పెద్ద ఎత్తున జనంతో మాల్ కిక్కిరిసి ఉన్న సమయంలో ఈ కాల్పులు చోటు చేసుకోవడంతో జనం భయంతో పరుగులు తీశారు. 120 షాపులు ఈ మాల్ ఆవరణలో ఉన్నాయి. కాల్పులు జరిపిన దుండగుడిని పోలీసులు కాల్చి చంపారు. అతనొక్కడే కాల్పులకు తెగబడి ఉంటారని తాము భావిస్తున్టన్లు పోలీసులు తెలిపారు. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో ఓ వ్యక్తి మాల్ బయట కారు ఆపి కాల్పులు జరుపుతూ లోనికి ప్రవేశించినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
సంబంధిత వీడియోలు కూడా బైటికి వచ్చాయి. కాల్పుల గురించి స్థానికులు అలెన్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో దుండగుడు కూడా మరణించాడు. మృతుల వివరాలను కానీ, దుండగుడి వివరాలు కానీ పోలీసులు వెల్లడించలేదు. కాల్పులు జరిపినప్పుడు వందలాది మంది ఆ ప్రాంతంలో ఉన్నట్లు వీడియో దృశ్యాల్లో కనిపించింది. కాల్పుల శబ్దాలు వినగానే షాపింగ్ చేస్తున్న వాళ్లు, వర్కర్లు ప్రాణభయంతో స్టోరేజి ప్రాంతాల్లోకి పరుగెత్తి దాక్కున్నట్లు సిఎన్‌ఎన్ తెలియజేసింది. మృతుల్లో అయిదేళ్లనుంచి 61 ఏళ్ల వయసు ఉన్న వారున్నారని మాత్రమే పోలీసులు చెప్పారు. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. కాగా తాజా ఘటనపై అమెరికా అధ్యక్షుడు బైడెన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. టెక్సాస్ గవర్నర్‌తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. కాగా ఈ కాల్పుల ఘటనను మాటల్లో చెప్పలేని దుర్ఘటన’గా గవర్నర్ గ్రెగ్ అబోట్ పేర్కొన్నారు.
అగ్రరాజ్యం అమెరికాలో తుపాకీ సంస్కృతికి అద్దం పట్టే ఘటనలు ఇలీవలి కాలంలో విపరీతంగా పెరిగిపోయాయి. అకారణంగా కాల్పులు జరిపి అమాయకుల ప్రాణాలు బలిగొంటున్న సంఘటనలు అనేకం చోటు చేసుకున్నాయి. 2023లో కనీసం 198 మాస్ షూటింగ్ ఘటనలు చోటు చేసుకున్నాయని అధికారుల లెక్కలను బట్టి తెలుస్తోంది. ఈ కాల్పుల్లో వందలాది మంది ప్రాణాలు కోల్పయారు. దీంతో దేశంలో తుపాకీ చట్టాలను సవరించాలని, ఎవరుపడితే వారు తుపాకీలు కొనుగోలు చేసే పరిస్థితి లేకుండా చూడాలని పలువురు న్యాయ నిపుణులు డిమాండ్ చేస్తున్నారు.