Monday, December 23, 2024

గుండ్ల పోచంపల్లి రైల్వేస్టేషన్‌లో ఇకపై అంతా మహిళా ఉద్యోగులే

- Advertisement -
- Advertisement -

Gundla Pochampally as railway station for women employees

 

మనతెలంగాణ/హైదరాబాద్ : మహిళా ప్రయాణికులకు మెరుగైన సేవలందించడంలో, మహిళా సిబ్బందిని ప్రోత్సహించడంలో దక్షిణమధ్య రైల్వే ఎల్లప్పుడూ ముందంజలో ఉంటుంది. మహిళా శ్రామిక శక్తిని మరింత బలోపేతం చేసేందుకు, వారిలో మనోధైర్యాన్ని పెంపొందించాలన్న లక్ష్యంతో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గుండ్ల పోచంపల్లి రైల్వేస్టేషన్‌లో వంద శాతం మహిళా సిబ్బందిని నియమించి ‘మహిళా ఉద్యోగుల రైల్వే స్టేషన్’గా దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది. సికింద్రాబాద్ టు మేడ్చల్ సెక్షన్‌లోని సబర్బన్ రైల్వేస్టేషన్లలో ఒకటైన గుండ్లపోచంపల్లి రైల్వేస్టేషన్‌ను మంగళవారం మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆ స్టేషన్‌ను ‘మహిళా ఉద్యోగుల రైల్వేస్టేషన్’గా ఏర్పాటుచేశారు. ఈ రైల్వే స్టేషన్‌లో రైళ్ల రాకపోకల నిర్వహణ, సాంకేతిక సిబ్బంది, టికెటింగ్, భద్రత, ఇతర సంబంధిత రోజువారీ కార్యకలాపాల విధుల నిర్వహణ కోసం పూర్తిగా మహిళా సిబ్బందినే నియమించారు.

ఈ ఐదు రైల్వే స్టేషన్లలో మహిళలే…

మహిళా ఉద్యోగులను ప్రోత్సహించడంలో భాగంగా దక్షిణమధ్య రైల్వేలో సికింద్రాబాద్ డివిజన్ పరిధిలోని హైదరాబాద్‌లో అత్యంత రద్దీ స్టేషన్లలో ఒకటైన బేగంపేట్ రైల్వేస్టేషన్, హైదరాబాద్ డివిజన్‌లోని విద్యానగర్ రైల్వేస్టేషన్, విజయవాడ డివిజన్‌లోని రామవరప్పాడు, గుంటూరు డివిజన్‌లోని న్యూ గుంటూరు రైల్వేస్టేషన్, గుంతకల్ డివిజన్‌లోని చంద్రగిరి రైల్వేస్టేషన్‌లతో కలిపి ఈ ఐదు రైల్వే స్టేషన్లు ఇప్పటికే పూర్తిగా మహిళా ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్న రైల్వే స్టేషన్లుగా పనిచేస్తున్నాయి. దీంతోపాటు మహిళా సిబ్బంది పురుష సిబ్బందితో సమానంగా లోకో పైలట్లు, ట్రాక్ నిర్వహణ వంటి క్లిష్టమైన విధులను సమర్ధవంతంగా నిర్వహిస్తున్నారు. ఈ రంగాల్లో లోకో పైలట్లు 53, స్టేషన్ మాస్టర్లు 64, ట్రాక్ నిర్వహణ సిబ్బంది 837 మంది మహిళా ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. అంతేకాక దక్షిణ మధ్య రైల్వే మహిళా క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ క్రీడా పోటీల్లో పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబరుస్తూ అనేక పురస్కారాలు సాధిస్తున్నారు.

మహిళా ఉద్యోగుల్లో మరింత ఆత్మవిశ్వాసం

దక్షిణమధ్య రైల్వేలో మహిళా సాధికారత కోసం చేపడుతున్న చర్యలపై దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజీవ్ కిశోర్ సంతోషం వ్యక్తం చేశారు. జోన్‌లో మహిళల కోసం చేపడుతున్న అనేక కార్యక్రమాలు మహిళా ఉద్యోగుల్లో మరింత ఆత్మవిశ్వాసాన్ని పెంచడానికి తోడ్పడుతాయన్నారు. రైల్వేలో మహిళా సిబ్బంది అత్యంత అంకితభావంతో విధులు నిర్వహిస్తున్నారని ఆయన ప్రశంసించారు. మహిళల్లో సాధికారత కల్పించేందుకు సమాజంలో సానుకూల మార్పును తీసుకురావడానికి దక్షిణ మధ్య రైల్వే ఆదర్శంగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News