Thursday, November 14, 2024

పెద్ద అంబర్‌పేట్‌లో కాల్పుల కలకలం

- Advertisement -
- Advertisement -

 పార్ధీ గ్యాంగ్‌ను పట్టుకునే క్రమంలో గాల్లోకి పోలీసుల కాల్పులు
 సినీఫక్కీలో ఇద్దరు ముఠా సభ్యుల అరెస్ట్
మన తెలంగాణ /అబ్దుల్లాపూర్‌మెట్: నగర శివారు పెద్ద అంబర్‌పేట్ ఔటర్ రింగ్ రోడ్డు వద్ద శుక్రవారం కాల్పులు కలకలం సృష్టించాయి. సినీ పక్కీలో పార్ధీ గ్యాంగ్ దోపిడీ దొంగలను పట్టుకునే క్రమంలో పోలీసులు గాలిలోకి కాల్పులు చేశారు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా, అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం…గత కొంతకాలంగా తెలుగు రాష్ట్రాలలో పార్ధీ గ్యాంగ్ దోపిడీలు, దొంగతనాలు, హత్యలకు పాల్పడుతోంది. ఈ ముఠా సభ్యులు జాతీయ రహదారులపై పార్కింగ్ చేసిన వాహనాలు టార్గెట్‌గా వరుస దాడులు, దోపిడీలకు పాల్పడుతున్నారు. నెల రోజుల క్రితం నల్లగొండ జిల్లా, కట్టంగూరు సమీపంలో రూ.10 వేల నగదు కోసం ఓ డ్రైవర్‌ను హత్య చేశారు.

ఈ ఘటన జరిగిన వెంటనే నల్లగొండ ఎస్‌పి శరత్ చంద్ర పవార్ స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేసి నిఘా పెంచారు. అప్పటి నుండి ఈ ముఠాను పట్టుకునేందుకు పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. నెల రోజుల నుండి ఈ గ్యాంగ్ సభ్యుల కదలికలపై పూర్తి స్థాయిలో నిఘా పెట్టారు. అందులో భాగంగా శుక్రవారం తెల్లవారుజామున చౌటుప్పల్ నుండి గ్యాంగ్ సభ్యులు నగరం వైపు వెళ్తున్న సమాచారం నల్లగొండ పోలీసులకు తెలిసింది. దీంతో వారు వెంటనే రాచకొండ కమిషనరేట్ పరిధిలోని అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులను అప్రమత్తం చేశారు. ఇదే క్రమంలో పార్ధీ గ్యాంగ్ సభ్యులు బాటసింగారం కొత్తగూడం చౌరస్తా వద్ద ఎల్బీనగర్ వైపు వెళ్తున్న టాటా ఏస్ ప్యాసింజర్ ఆటోలో ఎక్కారు.

దీనిని గమనించిన నల్లగొండ సిసిఎస్ పోలీసులు ఆటోను అనుసరిస్తూ వచ్చారు. అదునుచూసి పెద్ద అంబర్‌పేట్ ఔటర్ రింగ్ రోడ్డు వద్దకు రాగానే అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసుల సహకారంతో పెట్రోలింగ్ వాహనాలతో ఆటోను అడ్డగించి గ్యాంగ్‌ను పట్టుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో దోపిడీదొంగలకు, పోలీసులకు నడుమ తీవ్ర ప్రతిఘటన చోటుచేసుకుంది. దొంగలు పారిపోకుండా ఉండేందుకు పోలీసులు ఒక రౌండ్ గాల్లో కాల్పులు జరిపారు. పోలీసులు చాకచక్యంగా కరుడుగట్టిన పార్ధీ గ్యాంగ్‌లోని ఇద్దరు కీలక వ్యక్తులను పట్టుకున్నారు. అనంతరం పట్టుబడిన ఇద్దరు దొంగలను నల్లగొండకు తరలించారు. సంఘటన స్థలాన్ని వనస్థలిపురం ఏసిపి కాశిరెడ్డి, అబ్దుల్లాపూర్‌మెట్ సిఐ అంజిరెడ్డితో కలిసి పరిశీలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News