పెషావర్: పాకిస్తాన్‌లోని సంక్షుభిత గిరిజన వజీరిస్తాన్ ప్రాంతంలో మంగళవారం గుర్తు తెలియని దుండగులు పోలియో నిరోధక వ్యాక్సినేషన్ బృందం కాల్పులు జరపగా వారికి రక్షణగా వెళుతున్న ఇద్దరు పోలీసులతోసహా ముగ్గురు వ్యక్తులు మరణించారు. అఫ్ఘానిస్తాన్‌కు సరిహద్దున ఉన్న వజీరిస్తాన్ జిల్లాలో ఇటీవల కొత్తగా 9 పోలియో కేసులు బయటపడడంతో పోలియో వ్యాక్సినేషన్ బృందం ఇంటింటికి వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టింది. వ్యాక్సినేషన్ బృందంలోని ఒక సభ్యుడితోపాటు ఇద్దరు పోలీసులను దుండగులు కాల్పిచంపారు. ఈ ఘాతుకానికి బాధ్యత వహిస్తూ ఇప్పటివరకు ఎటువంటి ప్రకటన వెలువడలేదు. కాగా..ఈ దారుణ ఘటనను ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా ముఖ్యమంత్రి మెహమూద్ ఖాన్ ఖండించారు. ఈ దారుణానికి పాల్పడిన వారిని సాధ్యమైనంత త్వరితంగా అరెస్టు చేయాలని ఆయన పోలీసులను ఆదేశించారు. పోలియో బృందాలపై దాడులు జరిపిన వారు మన పిల్లలకు శత్రువులని ఉత్తర వజీరిస్తాన్ డిప్యుటీ కమిషనర్ షాహిద్ అలీ ఖాన్ పేర్కొన్నారు. ఇటీవలి కాలంలో పోలియో నిరోధక వ్యాక్సినేషన్ ప్రక్రియను చేపట్టిన బృందాలపై దాడులు పెరిగిపోతున్నాయి.