Friday, December 20, 2024

పాకిస్థాన్‌లో 33 మందిని బలిగొన్న సాయుధ ఉగ్రమూకలు

- Advertisement -
- Advertisement -

పాకిస్థాన్ బెలూచిస్థాన్ ప్రావిన్స్‌లో సాయుధులైన దుండగులు పోలీస్‌స్టేషన్లు, రైల్వేట్రాక్‌లు, వాహనాలపై దాడి చేసి కాల్పులు జరపడంతో 33 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశం లోని పెద్దదైన ప్రావిన్సులో భారీ సాయుధ దాడిలో ఇదొకటని అధికారులు చెబుతున్నారు. ఈ 33 మందిలో 23 మంది ఆదివారం రాత్రి హత్యకు గురయ్యారు. ముసాఖెల్ ఏరియాలో బస్సును అడ్డగించి బలవంతంగా అందులోంచి ప్రయాణికులను కిందకు దించివేసిన తరువాత వారిలో కొందరిని గుర్తించి మరీ కాల్పులకు తెగబడ్డారు. “ సాయుధులైన దుండగులు ప్రయాణికులనే కాకుండా బొగ్గు లోడుతో వస్తున్న ట్రక్కు డ్రైవర్లను కూడా కాల్చి చంపారు ” అని డిప్యూటీ కమిషనర్ హమీద్ జహీర్ చెప్పారు. డ్రైవర్లను చంపిన తరువాత కనీసం పది ట్రక్కులకు నిప్పు పెట్టారని ఆయన తెలిపారు. బాధితులు పంజాబ్ ప్రావిన్సుకు చెందిన వారని అధికారులు తెలిపారు.

పాకిస్థాన్‌ఇరాన్ రైల్వేలైన్, బెలూచిస్థాన్ రాజధాని క్వెట్టాకు అనుసంధానంగా ఉండే బ్రిడ్జి కూడా పేలుళ్లకు ధ్వంసం అయ్యాయని రైల్వే అధికారి ముహమ్మద్ ఖషీఫ్ చెప్పారు. ఈలోగా ప్రావిన్స్ లోని పోలీస్, సెక్యూరిటీ స్టేషన్లపై సాయుధులు దాడి చేయగా, కనీసం పదిమంది మృతి చెందారని తెలిపారు. ఈ దాడులన్నిటికీ తామే బాధ్యులమని నిషేధిత బెలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ (బిఎల్‌ఎ) ప్రకటించింది. పారామిలిటరీ స్థావరంపై కూడా దాడి చేశామని ఈ మెయిల్ ద్వారా మీడియాకు వెల్లడించింది. అయితే పాకిస్థాన్ అధికారులు ఈ దాడిని ఇంకా ధ్రువీకరించవలసి ఉంది. బెలూచిస్థాన్ ముఖ్యమంత్రి సర్ఫరజ్ బుగ్తి ఈ దాడులను తీవ్రంగా ఖండించారు. మృతుల కుటుంబాలకు తీవ్ర సంతాపం తెలియజేశారు. ముసాఖెల్ సమీపాన అమాయకులైన ప్రయాణికులను లక్షంగా చేసుకుని అత్యంత పాశవికంగా ఉగ్రవాద మూకలు దాడులకు పాల్పడ్డారని, చివరకు వారు తగిన శిక్ష అనుభవించక తప్పదని పాకిస్థాన్ ఫెడరల్ ఇన్‌ఫర్మేషన్ మంత్రి అత్తాయుల్లా తరార్ హెచ్చరించారు.

ఈ సంఘటనపై పంజాబ్ ప్రభుత్వ అధికార ప్రతినిధి అజ్మాబుఖారీ తీవ్ర ఆందోళన వెలిబుచ్చారు. గతం లోనూ ఈ తరహా సంఘటనలు చోటు చేసుకున్నాయి. గత ఏప్రిల్‌లో బెలూచిస్థాన్‌లోని నొష్కి సిటీ సమీపాన బస్సులోంచి ప్రయాణికులను దించివేసి వారి గుర్తింపు కార్డులను తనిఖీ చేసి తొమ్మిది మంది ప్రయాణికులను సాయుధులైన దుండగులు కాల్చి చంపారు. గత ఏడాది అక్టోబర్‌లో పంజాబ్‌కు చెందిన ఆరుగురు కూలీలను గుర్తు తెలియని సాయుధులు కాల్చి చంపారు. బెలూచిస్థాన్ లోని కెచ్ జిల్లాలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. 2015లో 20 మంది నిర్మాణ రంగ కార్మికులు దాడులకు బలైపోయారు.
.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News