అమరావతి: కూతురును పుట్టింటికి పంపించలేదని అల్లుడిని భార్య తరపు బంధువులు కొట్టి చంపిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గుంటూరు జిల్లా తెనాలిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కఠేవరంలో జి వాసు అనే యువకుడు మూడు సంవత్సరాల క్రితం అదే గ్రామానికి చెందిన యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. గత మూడేళ్ల నుంచి ఆమె తన పుట్టింటికి వెళ్లలేదు. సోమవారం యువతి తల్లిదండ్రులు, బంధువులు వచ్చి తన కుమార్తెను పుట్టింటికి తీసుకెళ్తామని వాసును అడిగారు. వాసు నిరాకరించడంతో రెండు కుటుంబాల మధ్య గొడవలు జరిగాయి. దీంతో వాసు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు వస్తామని చెప్పారు.
వాసు సోదరుడు ఫోన్ చేసి ఇంటికి రమ్మని కబురు పంపడంతో అతడు గ్రామానికి వచ్చాడు. యువతి బంధువులు, స్థానికులు వాసును పట్టుకొని చితకబాదడంతో పాటు కర్రలు, స్కూ డ్రైవర్‌తో పొడవడంతో అతడు ఘటనా స్థలంలోనే చనిపోయాడు. అడ్డుకోబోయిన వాసు మేనమామపై కూడా యువతి బంధువులు గొడ్డలితో దాడి చేశారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసున్నారు. అదే ప్రాంతంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పర్యటన ఉండడంతో పోలీసులు బందోబస్తుకు వెళ్లారని సమాచారం. అందుకే ఆ గ్రామానికి పోలీసులను పంపించలేదని వినికిడి. ఆ గ్రామంలో వైసిపి నేతలు పోలీస్ స్టేషన్‌కు ఫోన్ చేసి కుటుంబ సభ్యుల పంచాయతీ అని తాము నచ్చచెప్పుతామని తెలపడంతో ఈ విషయం సీరియస్ తీసుకోలేదని గ్రామస్థులు ఆరోపణలు చేస్తున్నారు.