Monday, January 20, 2025

దక్షిణాఫ్రికాలో భారీ అవినీతికి పాల్పడిన గుప్తా బ్రదర్స్ దుబాయిలో అరెస్టు

- Advertisement -
- Advertisement -

Gupta Brothers arrested in Dubai for massive corruption in South Africa

15 బిలియన్ రాండ్ల ( రూ. 7513 కోట్లు ) ను కొల్లగొట్టారు
ముగ్గురిలో ఒకరిని ఇంకా అరెస్టు చేయలేదు
వీరివల్లనే పదవిని కోల్పోయిన జాకబ్ జుమా

జొహన్నెస్‌బర్గ్ : దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు జాకబ్ జుమా హయాంలో రాజకీయ పలుకుబడితో భారీ స్థాయిలో అవినీతికి పాల్పడిన భారత దేశానికి చెందిన గుప్తా సోదరులు ముగ్గురిలో రాజేష్ గుప్తా, అతుల్ గుప్తాను సోమవారం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అరెస్టు చేసింది. అక్రమాలు బయటపడగానే దుబాయి పారిపోయిన ఈ ముగ్గురు సోదరుల్లో ఇద్దరిని సోమవారం అక్కడి పోలీసులు అరెస్టు చేశారని దక్షిణాఫ్రికా ప్రభుత్వం వెల్లడించింది. అయితే మూడో సోదరుడు అజయ్ గుప్తాను ఎందుకు అరెస్టు చేయలేదో స్పష్టం కావడం లేదు. అవినీతి బాగోతంలో గుప్తా సోదరులపై ఇంటర్ పోల్ రెడ్ కార్నర్ గత ఏడాది జులైలో నోటీసులు జారీ చేసినా దాదాపు ఏడాది తరువాత వీరు అరెస్టు కావడం గమనార్హం. దక్షిణాఫ్రికా ప్రభుత్వ యాజమాన్యం లోని సంస్థల నుంచి బిలియన్ల కొద్దీ ర్యాండ్లను ( దక్షిణాఫ్రికా కరెన్సీ ) దోచుకున్నారని గుప్తా సోదరులపై ఆరోపణలు ఉన్నాయి.

ఈ అక్రమాలపై విచారణలు సాగుతుండగానే ఈ సోదరులు దక్షిణాఫ్రికా నుంచి 2018 లో తమ కుటుంబాలతోసహా దుబాయికి పరారయ్యారు. దీంతో దక్షిణాఫ్రికా ప్రభుత్వం చొరవతో ఇంటర్ పోల్ నుంచి రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయ్యాయ. వారిని దుబాయ్‌లో అరెస్టు చేసినట్టు ఆ దేశం న్యాయ చట్ట అధికార యంత్రాంగం నుంచి నిర్ధారించిందని దక్షిణాఫ్రికా న్యాయం, సవరణల సర్వీసెస్ సోమవారం ఒక ప్రకటనలో తెలియజేసింది. భారత్ లోని ఉత్తరప్రదేశ్ రాష్ట్రం షహరాన్‌పుర్‌కు చెందిన గుప్తా సోదరులు 1990 లో దక్షిణాఫ్రికాకు తరలివెళ్లి షూ వ్యాపారం మొదలు పెట్టారు. అక్కడే స్థిరపడి ఐటీ, మీడియా, మైనింగ్, కంపెనీలతో పాటు ఇతర రంగాల్లో వ్యాపారాన్ని విస్తరించారు. అతి తక్కువ కాలం లోనే దక్షిణాఫ్రికాలో అత్యంత సంపన్నులుగా పేరొందారు. దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు జాకబ్ జుమాకు చేరువయ్యారు.

ఆ సాన్నిహిత్యాన్ని దుర్వినియోగించుకుని నేషనల్ ఎలక్ట్రిసిటీ సప్లయర్ ఎస్కాం వంటి అనేక ప్రభుత్వ రంగ సంస్థలను కొల్లగొట్టినట్టు వీరిపై ఆరోపణలు ఉన్నాయి. జుమా అధ్యక్షుడుగా ఉన్న సమయంలో కేబినెట్ మంత్రుల దగ్గర్నుంచి అనేక ప్రభుత్వ నియామకాలను వీరు ప్రభావితం చేశారని ఆరోపణలు వచ్చాయి. వీరి కారణంగా 2018 లో జుమా అధ్యక్ష పదవి నుంచి బలవంతంగా దిగిపోవలసి వచ్చింది. అదే సమయంలో దేశం విడిచి దుబాయి పారిపోయారు. ప్రభుత్వ సంస్థల నుంచి గుప్తా సోదరులు దాదాపు 15 బిలియన్ రాండ్లను కొల్లగొట్టినట్టు దర్యాప్తు సంస్థలు వెల్లడించాయి. భారత కరెన్సీ ప్రకారం వారు దోచుకున్నది దాదాపు రూ. 7513 కోట్లకు మించి ఉంటుంది. వీరిని దక్షిణాఫ్రికాకు రప్పించేందుకు దక్షిణాఫ్రికా ప్రభుత్వం గతంలో ఎంతో ప్రయత్నించింది.

ఐక్యరాజ్య సమితి ఇందులో జోక్యం చేసుకోవాలని అభ్యర్థించింది. ఈమేరకు అరబ్ ఎమిరేట్స్‌తో చర్చలు జరిపినా ఫలించలేదు. దీనికి కారణం ఈ రెండు దేశాల మధ్య అప్పగింత ఒప్పందం లేకపోవడమే. 2021 జూన్‌లో ఈ ఒప్పందం కుదిరిన తరువాత వారిని రప్పించడానికి ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయి. జుమాతో పాటు గుప్తా సోదరులపై అవినీతి కేసులకు సంబంధించి అనేక మంది సాక్షులు లభించిన తరువాత తాము దక్షిణాఫ్రికాకు రావడానికి సిద్ధంగా లేమని గుప్తా సోదరులు 2018 లో దర్యాప్తు కమిషన్‌కు చెప్పారు. భారత్ లోనూ ఆ కుటుంబంపై మనీ ల్యాండరింగ్ ఆరోపణలు ఉన్నాయి. 2018 లో ఆ కేసుకు సంబంధించి ఐటీ శాఖ దర్యాప్తు చేపట్టారు. అయితే తామెలాంటి దుర్వినియోగానికి పాల్పడలేదని గుప్తా సోదరులతోపాటు జుమా కూడా వెల్లడించడం విశేషం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News