వెల్లింగ్టన్: న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్ మార్టిన్ గప్టిల్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఈ విషయాన్ని ఆయన బుధవారం అధికారికంగా ప్రకటించాడు. జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించే అవకాశం దక్కడం అదృష్టంగా భావిస్తున్నట్లు పేర్కొన్నాడు. తన కెరీర్‌లో మద్దతుగా నిలిచిన కివీస్ క్రికెట్ బోర్డు, కోచ్‌లు, సహచర ఆటగాళ్లకు కృతజ్ఞతలు తెలిపాడు. 2009లో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన గప్టిల్.. దాదాపు 14 సంవత్సరాల పాటు న్యూజిలాండ్ జట్టు ప్రాతినిథ్యం వహించాడు.
గప్టిల్ చివరిసారిగా 2022 అక్టోబర్‌లో న్యూజిలాండ్ తరఫున బరిలోకి దిగాడు. కెరీర్‌లో ఇప్పటి వరకూ 367 మ్యాచ్‌ల్లో 13,463 పరుగులు చేశాడు. అందులో 23 సెంచరీలు ఉన్నాయి. టి20ల్లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా నిలిచాడు. పొట్టి ఫార్మాట్‌లో 122 మ్యాచులు ఆడిన గఫ్టిల్ 3561 పరుగులు సాధించాడు. ఇక వన్డేల్లోనూ 7,346 పరుగులు చేసి, ఈ ఫార్మాట్‌లో న్యూజిలాండ్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు. అరంగేట్రం చేసిన తొలి వన్డేలోనే సెంచరీ సాధించిన తొలి న్యూజిలాండ్ బ్యాటర్ గానూ రికార్డు సృష్టించాడు. వెస్టిండిస్‌పై జరిగిన అరంగేట్ర మ్యాచ్‌లో శతకం బాదాడు.2015 ప్రపంచకప్ క్వార్టర్ ఫైనల్‌లో గప్టిల్ వెస్టిండీస్‌పై డబుల్ సెంచరీ బాదాడు. ఆ మ్యాచ్‌లో 237 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అలా వన్డేల్లోనూ డబుల్ సెంచరీ చేసిన తొలి న్యూజిలాండ్ బ్యాటర్‌నూ రికార్డు నెలకొల్పాడు. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో 24 ఫోర్లు, 11 సిక్సర్లతో వెస్టిండిస్ బౌలర్లపై వీరవిహారం చేశాడు.