Monday, December 23, 2024

ప్రభుత్వం ఆరు గ్యారంటీల అమలు కాదు… పేద బిడ్డల ప్రాణాలకు గ్యారంటీ ఇవ్వాలి

- Advertisement -
- Advertisement -

బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్

మన తెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీల హామీల కంటే, సంక్షేమ గురుకులాల్లో చదివే పేద బిడ్డల ప్రాణాలకు గ్యారంటీ ఇవ్వాలని బిఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ సూచించారు. ఆదివారం సూర్యాపేట సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్దిని దగ్గుపాటి వైష్ణవి మృతదేహాన్ని ఏరియా ఆస్పత్రిలో పరిశీలించి గురుకుల పాఠశాల ఎదుట రోడ్డుపై ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడి 60 రోజులు పూర్తియినా సిఎం రేవంత్ రెడ్డి ఎస్సీ,ఎస్టీ, మైనారిటీ సంక్షేమ శాఖలకు మంత్రులను నియమించకపోవడం శోచనీయమన్నారు. సంక్షేమ శాఖలకు మంత్రులు లేకపోతే లక్షలాది మంది విద్యార్థులు తమగోడును ఎవరికి చెప్పుకోవాలని ప్రశ్నించారు.

ప్రజా పాలన అంటే ఇదేనా అంటూ విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే స్పందించి ఎస్సీ,ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖలకు మంత్రులను నియమించాలని డిమాండ్ చేశారు. సంక్షేమ గురుకులాలు,వసతి గృహాల్లో విద్యార్థుల వరుస ఆత్మహత్యలపై ముఖ్యమంత్రి స్పందించి అసెంబ్లీ సమావేశాల్లో చర్చించాలన్నారు. ఆత్మహత్యలకు పాల్పడిన విద్యార్థుల కుటుంబాలకు కోటి రూపాయలు ఎక్స్‌గ్రేషియా చెల్లించి, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో విద్యార్థినిల వరుస ఆత్మహత్యలపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించి బాధ్యులను శిక్షించాలన్నారు. అన్ని సంక్షేమ గురుకులాలు, వసతి గృహాల్లో విద్యార్థుల కోసం ప్రత్యేకంగా సైకాలజిస్ట్ లను నియమించి, విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇవ్వాలని కోరారు.అనంతరం సూర్యాపేట అడిషనల్ కలెక్టర్ వెంకట్ రెడ్డి ధర్నా వద్దకు చేరుకొని ఆత్మహత్యకు కారణమైన ప్రిన్సిపల్, సంబంధిత అధికారులను సస్పెండ్ చేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. ధర్నాలో పార్టీ రాష్ట్ర నాయకులు వట్టే జానయ్య, జిల్లా అధ్యక్షులు భీమయ్య, నాయకులు మల్లేష్, శ్రీనివాస్, రవి,స్టాలిన్ తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News