చండీగఢ్: రైతు నాయకుడు గుర్నామ్ సింగ్ చదూని శనివారం సంయుక్త్ సంఘర్ష్ పార్టీ పేరిట రాజకీయ పార్టీని ఏర్పాటు చేశారు. వచ్చే ఏడాది జరగనున్న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని చదూని తెలిపారు. మూడు వ్యవసాయ చట్టాలపై ఏడాదికి పైగా రైతులు జరిపిన ఆందోళనకు సారథ్యం వహించిన 40 రైతు సంఘాల సమాఖ్య సంయుక్త కిసాన్ మోర్చ(ఎస్‌కెఎం)లో చదూని కూడా సభ్యులు. శనివారం నాడిక్కడ చదూని విలేకరులతో మాట్లాడుతూ రాజకీయాలను ప్రక్షాళన చేసి మంచి వ్యక్తులను రాజకీయాల్లోకి తీసుకురావడమే లక్షంగా రాజకీయ పార్టీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రస్తుత రాజకీయ నాయకులు పేదల ప్రయోజనాలను విస్మరిస్తూ పెట్టుబడిదారులకు అనుకూలంగా విధానాలు రూపొందిస్తున్నారని ఆయన ఆరోపించారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో తాను మాత్రం పోటీ చేయబోనని ఆయన చెప్పారు.రాష్ట్రంలోని మొత్తం 117 అసెంబ్లీ స్థానాలలో తన పార్టీ పోటీ చేస్తుందని ఆయన తెలిపారు.
Gurnam Singh Charuni launched Political Party in Punjab