నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వాంకిడి గురుకుల విద్యార్థిని శైలజ సోమవారం మృతి చెందారు. సెప్టెంబర్ 30న కుమ్రం భీం జిల్లా వాంకిడి పాఠశాలలో కలుషిత ఆహారం తిని 64 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వీరిలో పరిస్థితి విషమంగా ఉన్న శైలజ సహా ఇద్దరు విద్యార్థులను నిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. శైలజ మినహా ఇద్దరు విద్యార్థులు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. శైలజ కోలుకోకపోవడంతో డాక్టర్లు వెంటిలేటర్‌పై చికిత్సను కొనసాగించారు. అయినా ఆమె ఆరోగ్యం ఎంత మాత్రం మెరుగుపడలేదు. దాదాపు 25 రోజులుగా నిమ్స్ ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై ఉన్న శైలజ సోమవారం కన్నుమూశారు.
శైలజ మృతికి ముమ్మాటికీ రేవంత్ ప్రభుత్వమే కారణం : హరీష్ రావు
రేవంత్ సర్కారు నిర్లక్ష్యానికి బలైపోయిన వాంకిడి గిరిజన గురుకుల విద్యార్థిని శైలజకు మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ హరీష్‌రావు ఎక్స్ వేదికగా కన్నీటి నివాళి అర్పించారు. మీ ప్రాణాలు బలి తీసుకున్న పాపం.. ఈ దుర్మార్గపు కాంగ్రెస్‌ను వెంటాడుతదని, 25 రోజులుగా నువ్వు వెంటిలేటర్ మీద అనుభవించిన నరకానికి ప్రభుత్వమే జవాబుదారీ..ఆ తల్లిదండ్రులకు గుండె కోతను మిగిల్చిండు సిఎం అంటూ ట్వీట్ చేశారు. తోటి విద్యార్థులతో ఆడుతూ, పాడుతూ బడిలో పాఠాలు నేర్చుకోవాల్సిన ఆ చిన్నారి.. విషాహారం వల్ల కన్నుమూయటం కలిచి వేస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం అభం, శుభం తెలియని గిరిజన బిడ్డకు శాపంగా మారిందని, తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చిందని పేర్కొన్నారు.
వాంకిడి గురుకులంలో నాణ్యత లేని భోజనం పెట్టడం పాపం కాగా, అస్వస్థతకు గురైన విద్యార్థులకు సకాలంలో మెరుగైన చికిత్స అందించకపోవడం మరొక పాపం అని వ్యాఖ్యానించారు. అడుగడుగునా ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం విద్యార్థిని ప్రాణాల మీదకు తెచ్చిందని మండిపడ్డారు. నిమ్స్ ఆసుపత్రిలో బిడ్డను పట్టుకొని అక్కడే ఉన్న ఆ తల్లిదండ్రులకు భరోసా ఇవ్వడంలోనూ సర్కారు పూర్తి వైఫల్యం చెందిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు ఆ అమ్మాయి చావును కూడా దాచి పెట్టాలనే ఉద్దేశ్యంతో, దొంగ చాటున మృతదేహాన్ని తరలిస్తుండడం సిగ్గుచేటు అని మండిపడ్డారు. గిరిజన విద్యార్థినీ కుటుంబానికి బాధ్యత వహించి రూ.50 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
శైలజ మరణ వార్త ఎంతగానో కలచి వేసింది: ఎంఎల్‌సి కవిత
కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ పరిపాలన మరో పేదబిడ్డ ప్రాణం తీసిందని, కన్నతల్లికి కడుపు కోత మిగిల్చిందని బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కవిత ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. వాంకిడి గిరిజన ఆశ్రమ పాఠశాలలో కలుషిత ఆహారం వల్ల అస్వస్థతకు గురై 20 రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారి శైలజ మరణ వార్త నన్ను ఎంతగానో కలచి వేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆనాడు తెలంగాణ రాష్ట్రం కోసం వందలాది ప్రాణాలు బలి తీసుకున్న కాంగ్రెస్ పార్టీ.. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో సంక్షేమ పాఠశాలలో కనీసం బుక్కెడు బువ్వ కూడా పెట్టకుండా, పదకొండు నెలల్లో 43 మంది విద్యార్థుల ప్రాణాలు తీసిందని, ఇవన్నీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన హత్యలే అని పేర్కొన్నారు.
గిరిజన విద్యార్థి శైలజ మరణం ప్రభుత్వం హత్యే : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
గిరిజన విద్యార్థి శైలజ మరణం ప్రభుత్వం హత్యే అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. ఏడాది పాలనతో గురుకులాల విద్యను దిగజార్చారని మండిపడ్డారు. బిఆర్‌ఎస్ పాలనలో ఎవరెస్ట్ శిఖరం అంత ఎత్తుగా ఎదిగిన గురుకులాల ప్రతిష్టను కాంగ్రెస్ భ్రష్టు పట్టించిందని విమర్శించారు. ప్రతిరోజూ రాష్ట్రంలో ఏదో ఒక గురుకుల పాఠశాల, వసతిగృహంలో ఫుడ్ పాయిజన్ కేసులు వెలుగుచూస్తున్నా ప్రభుత్వం కనీసం సమీక్షించడం లేదని అన్నారు. విద్యార్థుల సమస్యల పరిష్కారం విషయంలో ప్రభుత్వానికి ఎలాంటి చిత్తశుద్ధి లేదని పేర్కొన్నారు. శైలజ మరణానికి ప్రభుత్వం బాధ్యత వహించాలని ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.