Monday, December 23, 2024

పనామాలోనూ ఎర్రజెండా?

- Advertisement -
- Advertisement -

 

Gustavo petro is president of colombia

లాటిన్ అమెరికాలో పెరుగుతున్న వామపక్ష అలలను కట్టడి చేసేందుకు అమెరికా ఒక విధానాన్ని రూపొందించాల్సిన అవసరం ఉందంటూ తాజాగా ఒక ప్రొఫెసర్ హెచ్చరించాడు. రెండు వందల సంవత్సరాల్లో తొలిసారిగా అమెరికాకు సన్నిహితమైన కొలంబియాలో వామపక్ష నేత గుస్తావ్ పెట్రోను ఎన్నుకోవటంతో ప్రతిదీ మారుతోందంటూ గుండెలు బాదుకున్నాడు. 2010 దశకం నుంచి పెరుగుతున్న ఎర్రమంటను ఆర్పలేకపోయినట్లు వాపోయాడు. రష్యా, చైనాలను అడ్డుకోవటం ఎలా అన్నదాని మీదే అమెరికా కేంద్రీకరిస్తోంది తప్ప లాటిన్ అమెరికాలో వాటి ప్రభావాన్ని అడ్డుకొనేందుకు చూడటం లేదన్నాడు. వెనెజులాను దెబ్బతీయటంలో కొలంబియా ప్రధాన పాత్రధారిగా ఉంది.ఇప్పుడు గుస్తావ్ పెట్రో వెనెజులాతో సంబంధాలను పునరుద్ధరించుకుంటానని చెప్పటం అమెరికాకు పెద్ద ఎదురుదెబ్బ.

ఇటీవల జరిగిన అమెరికా దేశాల శిఖరాగ్ర సమావేశానికి వెనెజులా, క్యూబా, నికరాగువాలను ఆహ్వానించనందుకు నిరసనగా తాను ఆ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు మెక్సికో అధ్యక్షుడు లోపెజ్ ప్రకటించటం అమెరికాకు చెంపదెబ్బ వంటిది. జో బైడెన్ శ్రద్ధలేమి వలన దూరంగా ఉన్న చైనా, ఉత్తర కొరియా, ఇరాన్, అఫ్ఘానిస్తాన్, భారత్, తూర్పు ఐరోపాలనే కాదు, మూర్ఖత్వం, అచేతనం, పట్టించుకోని కారణంగా పెరటితోటగా ఉన్న లాటిన్ అమెరికాను కూడా కోల్పోతున్నామంటూ మరో విశ్లేషకుడు వాపోయాడు. రెండు సంవత్సరాలు కూడా గడవక ముందే అమెరికా అనుకూల పెరూ, కొలంబియాలను బైడెన్ ఏలుబడిలో కోల్పోయాము. బ్రెజిల్ నుంచి పనామా, గౌతమాల నుంచి మెక్సికో వరకు ఎక్కడ చూసినా వామపక్ష శక్తులు ముందుకు పోతున్నాయి. జనాలను చైతన్యవంతులను గావించేందుకు గత రెండు దశాబ్దాల్లో మనం ఖర్చు చేసిన బిలియన్ల డాలర్లు దేనికీ పనికి రాలేదు. మన పెరటితోటలోనే పలుకుబడి కోల్పోవటాన్ని ప్రపంచంలోని మనస్నేహితులు చూస్తున్నారు. ఈ పరిణామాన్ని చూస్తున్న చైనా చిరునవ్వులు చిందిస్తోంది, మన స్థానాన్ని ఆక్రమించేందుకు చూస్తోంది. గత పాతిక సంవత్సరాల్లో మన అధ్యక్షులతో భేటీ వేసిన వారందరూ ఒక్కొరొక్కరుగా జారిపోతుంటే గుండెలు బద్దలువుతున్నాయి.దీర్ఘకాలం మన అనుంగు దేశంగా ఉన్న కొలంబియా వామపక్ష శక్తుల వశమైందని కూడా బైడెన్ గ్రహించినట్లు లేదు. చైనా తమ ప్రాంతంలోనే కాదు చివరికి మన దగ్గర కూడా కమ్యూనిజాన్ని ముందుకు నెడుతోందని సద రు విశ్లేషకుడు గుండెలు బాదుకున్నాడు.

లాటిన్ అమెరికాలో జరుగుతున్న పరిణామాల గురించి కొందరు అమెరికా భక్తుల కడుపు మంట ఇది. వెనెజులాలో ఆగస్టు నెలలో జరిగే మిలిటరీ క్రీడలనే కాదు, పనామాలో జరుగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలను కూడా పట్టించుకోకపోతే అది కూడా వామపక్షాల వశం కానుందని ఒక విశ్లేకురాలు రాసిన దానికి వాల్‌స్ట్రీట్ జనరల్‌తో సహా అనేక పత్రికలు ప్రాధాన్యత ఇచ్చాయి. పశ్చిమార్ధగోళంలో తొలిసారిగా రష్యా నిర్వహించే క్రీడలివి. లాటిన్ అమెరికాలో రష్యా, ఇరాన్, చైనా నిరంతరం కనిపిస్తూనే ఉంటాయని చెప్పటమే మిలిటరీ క్రీడల లక్ష్యమని మరింతగా చెప్పాలంటే ఈ ప్రాంతం వెలుపల అమెరికాను వ్యతిరేకించే మిలిటరీలను ఇక్కడి దేశాలు ఆహ్వానించే, సమ్మతికి బాటవేయటమేనని కూడా ఆమె పేర్కొన్నారు. అసలు పనామాలో ఏం జరుగుతోంది? పనామా అనగానే మనకు వెంటనే గుర్తుకు వచ్చేది పనామా కాలువ. అట్లాంటిక్ పసిఫిక్ సముద్రాలను కలిపే 81 కిలోమీటర్ల పొడవైన కాలువ. పనామా జనాభా నలభై లక్షలు కాగా, సగం మంది రాజధాని పనామా సిటీలోనే ఉంటారు. ఉత్తర దక్షిణ అమెరికాలను అనుసంధానించే దేశం పనామా.

జులై 6 తేదీన శాంటియాగో డి వెరాగువాస్ అనే చిన్న పట్ణణంలో (ఇది పనామా కాలువ నుంచి ఇతర లాటిన్ అమెరికా దేశాలకు వస్తువులను రవాణా చేసే కీలక రహదారి ప్రాంతంలో ఉంది. దాన్ని మూసివేస్తే రవాణా మొత్తం ఆగిపోతుంది) ప్రభుత్వ విధానాలు, జనం మీద మోపుతున్న భారాలకు వ్యతిరేకంగా సమ్మె రూపంలో టీచర్ల సంఘం తొలుత నిరసన తెలిపింది.బిల్లు బెల్లు తప్ప మిగతా వాటితో మనకేం పని అని వారు అనుకోలేదు. తరువాత దేశంలోని అన్ని ప్రాంతాలకు నిరసన పాకింది. బలమైన నిర్మాణ సంఘ కార్మికులు కలిశారు. తరువాత రైతులు, విద్యార్ధులు, మూలవాసులు అందరూ గళం విప్పారు. కార్మికుల సమ్మెతో విమానాలు ఎక్కాల్సిన వారు నడిచి పోవాల్సి వచ్చింది. శ్రీలంక పరిణామాలు గుర్తుకు వచ్చి లేదా తోటి దేశాల్లో పరిణామాలను చూసి కావచ్చు, 17 తేదీన గాలన్ (3.78 లీటర్లు) పెట్రోలు ధరను ఆరు నుంచి 3.25 డాలర్లకు తగ్గించారు. మన ప్రధాని నరేంద్ర మోడీ కొంత మేర సెస్‌లను తగ్గించారు. ఏప్రిల్ ఆరు నుంచి ధరలను స్తంభింపచేశారు. పనామా టీచర్లు సమ్మె విరమించలేదు.

20వ తేదీన పనామా కాథలిక్ బిషప్పును రంగంలోకి తెచ్చారు. ప్రభుత్వం నిరసన తెలుపుతున్న సంఘాల ప్రతినిధులతో కూర్చోపెట్టారు. ఆహార, ఔషధాల ధరల అదుపు, విద్యపై ఖర్చు పెంపు, విద్యుత్ సబ్సిడీల వంటి ఎనిమిది అంశాలపై ప్రజాసంఘాలు ఆమోదం తెలిపినట్లు బిషప్ ప్రకటించారు తప్ప ఆందోళనలు ఆగలేదు. అస్తవ్యస్తంగా పరిస్థితి మారింది. ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడేందుకు ఎవరూ సిద్ధం కాలేదు. ధరల పెరుగుదలే కాదు, రాజకీయ అవినీతిపై చర్యలు, రాజకీయ సంస్కరణలు చేపట్టాలనే డిమాండ్లు కూడా ముందుకు వచ్చాయి. ప్రస్తుతం కాస్త సద్దుమణిగినా తదుపరి ఏం జరగనుందో చెప్పలేము.

రోవ్‌ు నగరం తగులబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయిస్తూ దర్శనమిచ్చినట్లుగా జనం తీవ్ర ఇక్కట్లపాలైన స్థితిలో పనామా పాలక పార్టీ ఎంపిలు ఖరీదైన విస్కీ తాగుతూ మజా చేస్తున్న వీడియోలు జనానికి ఆగ్రహం తెప్పించాయి. ఆశ్రితులను అందలాలెక్కించటం, సంస్కరణల పేరుతో కార్మికుల హక్కులను హరించటం, ఖరీదైన విదేశీ ఔషధాల దిగుమతులకు అనుమతుల వంటి వాటికి ఇచ్చిన ప్రాధాన్యత జనఇబ్బందులకు ఇవ్వలేదు. ఔషధాల లేమి, వేతనాల కోత, చివరికి డాక్టర్లకు సైతం వేతనాల నిలిపివేత, చేసేందుకు పని లేకపోవటం వంటి పరిణామాలు సంభవించాయి. ఆపరేషన్ చేయాల్సిన చోటబాండ్ ఎయిడ్‌వేసినట్లుగా అరకొర చర్యలు జనాన్ని సంతృప్తి పరచలేదు.ప్రభుత్వం విశ్వసనీయత పోగొట్టుకుంది.జనవరి తరువాత చమురు ధరలు 50 శాతం పెరిగాయి,నిరుద్యోగం 10 శాతానికి చేరింది.ద్రవ్యోల్బణం పెరుగుతోంది.మిగతా దేశాల పాలకులు చెప్పినట్లే ధరల పెరుగుదలకు కరోనా, ఉక్రెయిన్ సంక్షోభం కారణమని అధ్యక్షుడు కార్టిజో తప్పించుకోచూశాడు.దేశం ఆరున్నర శాతం రేటుతో అభివృద్ది చెందుతున్నట్లు చెబుతున్న ప్రభుత్వం ఔషధాలను ఎందుకు సరఫరా చేయలేకపోతోందన్న ప్రశ్నకు జవాబు లేదు.

లాటిన్ అమెరికాలో ఆర్ధిక అసమానతలు ఎక్కువగా ఉన్న దేశాల్లో పనామా ఒకటి. అది అనుసరిస్తున్న నయా ఉదారవాద విధానాలతో అసమానత మరింత పెరిగింది. కరోనాతో జనజీవితాలు మరింతగా దిగజారాయి. అంతకు ముందు 2018లోనే ఇరవై శాతం జనం దారిద్య్రరేఖకు దిగువన ఉండగా 10 శాతం మంది దుర్భర దారిద్య్రంలో ఉన్నారు. కరోనాకు ముందు ప్రైవేటు రంగంలో 8,73,750 మంది వేతన జీవులుండగా కరోనాలో 37 శాతం మందిని తొలగించారు, 30 శాతం మందినే కొనసాగించారు, 33 శాతం మంది కాంట్రాక్టు ఒప్పందాలను సస్పెండ్ చేశారు, అంటే వారికి కూడా ఉపాధి లేదు. 2021లో వారిని తిరిగి తీసుకున్నారు. ప్రభుత్వం పొదుపు పేరుతో 10 శాతం ఖర్చు కోతపెట్టి 27వేల మంది ఉద్యోగులను తొలగించింది. ఇక ఆర్ధిక అవినీతి సంగతి చూస్తే 2009 నుంచి 2019 వరకు 46 బిలియన్ డాలర్ల మేరకు పన్నులు ఎగవేసిన వారి మీద ఎలాంటి చర్యలూ లేవు. ఒక్క 2019లోనే ఆరు బిలియన్ డాలర్ల మేరకు ఎగవేశారంటే ఇప్పుడు ఇంకా పెరిగిందన్నది స్పష్టం. ఇదంతా అనేక పన్ను రాయితీలు ఇచ్చిన తరువాత జరిగిన అవినీతి.పనామాలో తలెత్తిన ఆందోళనకు మూలం నూతన ఉదారవాద విధానాల పేరుతో ధనికులకు దోచి పెట్టే విధానపరమైనది తప్ప మరొకటి కాదు. రేటింగ్ సంస్థ ఫిచ్ జనవరిలో చెప్పిన దాని ప్రకారం కేంద్ర ప్రభుత్వ రుణభారం జిడిపిలో 68.5 నుంచి 2021లో 64.2 శాతానికి తగ్గింది.

సామాజిక భద్రతా పధకాల రుణాలను పక్కనపెడితే అది 57.7 శాతానికి తగ్గుతుంది. 2020లో 17.9 ప్రతికూల వృద్ధి రేటు నుంచి కోలుకొని 2021లో అంచనా వేసిన 12ను అధిగమించి 15 శాతం వృద్ధి నమోదైంది. 2022, 2023లో వరుసగా 7,5 శాతాల చొప్పును పెరుగుతుంది. దీర్ఘకాల మందగమనం నుంచి బయటపడుతుంది. పనామా కాలువ టోల్ ద్వారా, రాగి ఎగుమతులు ఆర్ధిక వృద్ధికి చోదకాలుగా ఉన్నాయి. 2021 నవంబరు వరకు అంతకు ముందు ఏడాదితో పోలిస్తే 0.9 బి.డాలర్లుగా ఉన్న రాగి ఎగుమతులు 2.5 బి డాలర్లకు పెరిగాయి. రానున్న రెండు సంవత్సరాల్లో ఇంకా పెరుగుతుంది. ఏటా 13 14వేల ఓడలు ప్రయాణించే పనామా కాలువ ద్వారా కూడా గణనీయంగా రాబడి వస్తున్నది. పనామా కాలువ ప్రాజెక్టును చేజిక్కించుకోవాలని అమెరికా తలపెట్టిన తరువాత ఆ ప్రాంతాన్ని విడగొట్టి స్వతంత్ర దేశంగా మార్చేందుకు చేయాల్సిందంతా చేసింది. వేర్పాటువాదులను పాలకులుగా గుర్తించి 1903 లో వారితో ఒప్పందం చేసుకుంది.

2000 నాటికి కాలువను పనామా ప్రభుత్వానికి అప్పగించేందుకు 1979లో అమెరికా ఒప్పందం చేసుకుంది. తరువాత 1984 కుట్ర చేసి మిలిటరీ జనరల్ నోరిగానూ గద్దెపై కూర్చోపెట్టింది. అదే నోరిగా అటు అమెరికా సిఐఎ నుంచి ఇటు మాదకద్రవ్యాల మాఫియా నుంచి నిధులు పొందుతూ ఏకుమేకై అమెరికా పెత్తనాన్ని సవాలు చేశా డు. దాంతో 1989లో అమెరికా మిలిటరీ దాడి చేసి నోరిగాను గద్దె దించి తనకు అనుకూలమైన శక్తులకు మద్దతు ఇచ్చింది.2019 ఎన్నికల్లో అతనికి కేవలం 0.69 శాతం, పార్లమెంటు ఎన్నికల్లో ఫ్రంట్‌కు 1.26 శాతం ఓట్లు వచ్చాయి. తదుపరి ఎన్నికలు 2024లో జరగాల్సి ఉంది. వామపక్ష శక్తుల బలం పరిమితంగా ఉన్న పనామాలో 1930 దశకంలో కమ్యూనిస్టు పార్టీ ఏర్పడింది.

బలం పెద్దగా లేకున్నా పనామా కాలువను జాతీయం చేయాలన్న ఆందోళనలో చురుకుగా ఉండటమే గాక తరువాత అధికారానికి వచ్చిన ఉదారవాదులకు మద్దతు ఇచ్చింది. వారు ప్రజానుకూల విధానాలకు తిలోదకాలివ్వటంతో 1984లో వెలుపలికి వచ్చింది, 1991 లో పార్టీ గుర్తింపును రద్దు చేశారు. వామపక్షాలు చాలా బలహీనంగా ఉన్నప్పటికీ జులై నెలలో జరిగిన ప్రజాఉద్యమాలు ఆశక్తులు బలపడేందుకు దోహదం చేస్తాయనే భయాన్ని మితవాద శక్తులు ముందుగానే వెల్లడిస్తున్నాయి. లాటిన్ అమెరికాలో అనేక దేశాల్లో ప్రజా ఉద్యమాలు వామపక్ష శక్తులను ముందుకు తీసుకురావటం, జనం ఆదరించటమే దీనికి కారణం. పాలకుల ప్రజావ్యతిరేక విధానాలు ఇప్పటి మాదిరే కొనసాగితే 2024 పనామా ఎన్నికల్లో వామపక్షాలు ఒక ప్రధాన శక్తిగా ముందుకు వచ్చినా ఆశ్చర్యం లేదు.

ఎం కోటేశ్వరరావు
8331013288

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News