Saturday, November 23, 2024

ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారు: మండలి చైర్మన్ గుత్తా పైర్

- Advertisement -
- Advertisement -

నల్లగొండ: తెలంగాణలో ప్రతిపక్ష బిజెపి, కాంగ్రెస్ పార్టీలు ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తూ ప్రజలను మభ్యపెట్టి అధికార సాధనతో రాష్ట్రాన్ని దోచుకోవాలని చూస్తున్నారని వాళ్లు వస్తే సీఎం కేసీఆర్ పాలనలో అభివృద్ధి పథంలో సాగుతున్న తెలంగాణ రాష్ట్రం అస్థిరత, అవినీతిమ మయమవుతుందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆరోపించారు. బుధవారం నల్లగొండలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. రాజ్యాంగ వ్యవస్థలు, సంస్థల ద్వారా తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్న మతోన్మాద బిజెపి పట్ల, కర్ణాటక రాజస్థాన్ లతోపాటు అంతటా అంతర్గత కలహాలతో సాగుతున్న కాంగ్రెస్ పట్ల తెలంగాణ సమాజం అప్రమత్తంగా వ్యవహరించి, సుస్థిర సంక్షేమ పాలన కోసం కేసీఆర్ కు అండగా నిలవాలన్నారు.

ప్రధాని నరేంద్ర మోడీ వందే భారత్ రైలు ప్రారంభోత్సవం అధికారిక కార్యక్రమం అయితే బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కుర్చీ వేశామని, శాలువా తెచ్చానని, అయినా సీఎం కేసీఆర్ హాజరు కాలేదంటు విమర్శలు చేయడం విచారకరమన్నారు. ప్రధాని అధికారిక కార్యక్రమానికి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కి సంబంధం ఏమిటంటు ప్రశ్నించారు. రాజకీయ కక్షలతో రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చే ఉద్దేశం లేనప్పుడు ప్రధాని సభకు వెళ్లి విన్నవించిన ప్రయోజనం లేదనే సీఎం కేసీఆర్ ప్రధాని కార్యక్రమానికి దూరంగా ఉన్నారన్నారు.

దేశంలో హైవే ల విస్తరణల పేరుతో ప్రజలపై ఏటా రూ. 40 వేల కోట్ల భారం మోపుతున్నారని, ఒక్క తెలంగాణనుండే రూ. 1400 కోట్లు వసూలు చేస్తూ రాష్ట్రానికి ఏదో తామే కొత్త హైవేలు వేస్తున్నామన్నట్లుగా కేంద్రం గొప్పలు చెప్పుకుంటుందన్నారు. రాష్ట్రంలోని 14 కొత్త హైవేల ప్రతిపాదనలకు మోక్షం లేదని, 2019లో పూర్తి కావాల్సిన హైదరాబాద్ విజయవాడ ఆరు లైన్ల పనులు నేటికీ పూర్తి కాలేదన్నారు. యూపీఏ హయంలో ప్రతిపాదించిన నల్లగొండ మాచర్ల రైల్వే లైన్ ను మోడీ ప్రభుత్వం అటకెక్కిచ్చిందన్నారు. రాష్ట్రానికి సంబంధించిన హైవేలు, రైల్వే ప్రాజెక్టుల ప్రతిపాదనలను కేంద్రం పట్టించుకోవడం లేదన్నారు. విభజన హామీల అమలుకు చర్యలు తీసుకోవడం లేదన్నారు.

కృష్ణాజిల్లాలో వాటా తేల్చలేదని, డీలిమిటేషన్ అమలు చేయలేదని, గిరిజన యూనివర్సిటీ ఇవ్వలేదన్నారు. గవర్నర్ వ్యవస్థ ద్వారా ప్రతిపక్ష ప్రభుత్వాలను నిర్వీర్యం చేసేందుకు, రాష్ట్రాల అభివృద్ధిని అడ్డుకునే లక్ష్యంతో కేంద్రం పనిచేస్తుందన్నారు. మున్సిపల్ చట్ట సవరణ బిల్లును గవర్నర్ పెండింగ్లో పెట్టడం వెనుక అవిశ్వాస తీర్మానాలతో మున్సిపాలిటీలలో అస్థిరత రేగాలన్న బిజెపి చిల్లర రాజకీయం దాగి ఉందన్నారు.మరోవైపు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హైదరాబాద్ లో భూకేటాయింపులతో సీఎం కేసీఆర్ లక్ష కోట్లు దోచుకున్నారంటూ అభూత కల్పన లెక్కలు చెబుతూ అవాస్తవమైన ధరలతో లెక్కలు కడుతూ గుట్టలను వజ్రాల గనులన్నట్లుగా చెబుతూ దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. హైదరాబాదును విశ్వనగరంగా రూపొందించే క్రమంలో ప్రవేట్ సంస్థలకు భూములు కేటాయించక తప్పదన్నారు. ప్రభుత్వం పారిశ్రామిక పెట్టుబడుల సాధనకు ప్రోత్వాహాకాలు లైసెన్స్ సరళీకరణ, మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యతనిస్తుందన్నారు.

తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బిజెపి, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు చేస్తున్న రాజకీయ దుష్ప్రచారాన్ని ప్రజలు విశ్వసించరాదన్నారు. దేశంలో ప్రజాస్వామ్య రాజ్యాంగ వ్యవస్థ రక్షణకు ప్రధాని మోడీ నిరంకుశపాలనపై పోరాడేందుకు సీఎం కేసీఆర్ సారధ్యంలో ప్రజలంతా కలిసి నడవాలన్నారు కాంగ్రెస్ తో రాజకీయ వైరం ఉన్నా రాహుల్ గాంధీ అనర్హత వివాదంపై సీఎం కేసీఆర్ మోడీ ప్రభుత్వాన్ని ప్రశ్నించి ప్రజాస్వామ్య పరిరక్షణ చిత్తశుద్ధిని చాటారన్నారు.వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ పై మంత్రి కేటీఆర్ పర్యవేక్షణ చేస్తున్నారని, తెలుగు రాష్ట్రాల మధ్య విభేదాల కోణంలో కాకుండా తెలంగాణ పారిశ్రామిక ప్రయోజనాల నేపథ్యంలో వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ బిడ్డింగ్ విషయమై ప్రభుత్వం సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తుందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News