Saturday, November 23, 2024

తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతోంది: గుత్తా సుఖేందర్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

Gutta Sukender Reddy slams Centre Govt

 తెలంగాణపై కేంద్రం వివక్ష…!
 7 మండలాలను ఏకపక్షంగా ఎపిలో కలిపడంపై సమాధానం చెప్పాలి
 ఊసేలేని హన్మకొండ లో రైల్ కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు హామి
 దొడ్డురకం ధాన్యంపై కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలి
  మీడియా సమావేశంలో మండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
మన తెలంగాణ/నల్లగొండ: తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల మధ్య నదీ జలాల విషయంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మధ్యవర్తిత్వం వహిస్తా అనడాన్ని స్వాగతిస్తామని మండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పేర్కొన్నారు. కేంద్ర మంత్రి ఒక విధంగా చూస్తే.. బీజేపీ ప్రభుత్వం మాత్రం తెలంగాణకు నష్టం వాటిల్లేలా వ్యవహరిస్తోందని విమర్శించారు. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత బీజేపీ ప్రభుత్వం ఏకపక్షంగా ఏడు మండలాలను ఎపిలో కలిపారని, దానికి సమాధానం చెప్పాలని డిమాండు చేశారు.
హన్మకొండలో రైల్ కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన కేంద్రం ఇప్పుడు కనీసం ఊసెత్తడం లేదని ధ్వజమెత్తారు. పక్కన ఉన్న మహారాష్ట్రకు మాత్రం కోచ్ ఫ్యాక్టరీని మంజూరు చేసిన కేంద్రం.. తెలంగాణకు వచ్చేసరికి ప్రతి విషయంలో వివక్ష చూపిస్తు౦దని వ్యాఖ్యానించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణాకు రైల్వే కొచ్ ఫ్యాక్టరీని మంజూరు చేపించేందుకు కృషి చేయాలని కోరారు. కిషన్ రెడ్డి నిక్కచ్చిగా వ్యవహరించి తెలంగాణకు కేంద్రం నుండి రావాల్సిన నిధులను సాధించాలని సూచించారు. ప్రధానంగా దొడ్డు రకం వడ్లను కొనుగోళ్లు చేయమని సాక్షాత్తు ఎఫ్ సిఐ చెపుతుందని, దీనిపై కిషన్ రెడ్డి తెలంగాణ రైతులకు సమాధానం చెప్పాలని డిమాండు చేశారు. దొడ్డు రకం ధాన్యం విషయంలో తెలంగాణ రైతులు తీవ్ర ఆందోళనలో వున్నారని గుర్తు చేశారు. కిషన్ రెడ్డి ధాన్యం విషయంలో ప్రధాని మోడీ స్వయంగా చర్చించి సమస్య పరిష్కారం చూపెట్టాలని విజ్ఞప్తి చేశారు. బీజేపీ నాయకుల మాటలు కోటలు దాటుతున్నాయని, చేతలు మాత్రం గడప దాటడం లేదని ఎద్దేవా చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ నోటికి అడ్డు అదుపు లేకుండా పోయిందని, ఆయన మాటలు చూస్తుంటే అది నోరా, మురికి కాల్వనా అర్ధం కావడం లేదన్నారు. బీజేపీ చేస్తున్నవి అన్ని ప్రజా వ్యతిరేక విధానాలేనని అంబానీ, ఆదానిలకు బీజేపీ వత్తాసు పలుకుతుందని ఆరోపించారు.

కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఎల్ఐసీని అమ్ముతున్నారని, నల్ల చట్టాలను తెచ్చి రైతులను నట్టేట ముంచారని, వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ, బీఎస్ఎన్ఎల్ తదితర సంస్థలకు తెగనమ్మేందుకు కుట్రలు ప్రారంభమయ్యాయని మండిపడ్డారు. హస్సేన్ సాగర్లో నిమజ్జనం చేయవద్దని హైకోర్టు చెపితే, బండిసంజయ్ మాత్రం భాద్యతా రాహితంగా మాట్లాడుతున్నాడని గుర్తు చేశారు. అధికార దాహంతో వ్యవరిస్తున్నది బీజేపీ పార్టేనని.. రాత్రికి రాత్రే సీఎంలను మార్చే విధానాన్ని అవలంభిస్తున్నదని విమర్శించారు. బీజేపీ సిద్ధాంతాలు అన్ని వట్టి భూటకమే అని అర్ధం అవుతున్నదని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఫెడరల్ విధానంలో భాగంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం మోడీని కలిశారని, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దాన్ని కూడా రాజకీయ దుమారం లేపుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. మత విద్వేషాలను రెచ్చగొట్టి పబ్భం గడుపుకోవడమే బీజేపీ విధానమని విమర్శించారు. ఓట్ల కోసం నీచంగా వ్యవహరిస్తున్నది బీజేపీ పార్టీయే అని ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అహర్నిశలు కృషి చేసి తెలంగాణను నంబర్ వన్ స్థానంలో నిలిపారని గుర్తు చేశారు.

Gutta Sukender Reddy slams Centre Govt

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News