Monday, December 23, 2024

కోమటిరెడ్డి బ్రదర్స్ కు ఇది రాజకీయ ఆత్మహత్య: గుత్తా

- Advertisement -
- Advertisement -

 

నల్లగొండ న్యూస్ : మునుగోడు ఉప ఎన్నికల్లో ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గెలిచారని శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. నల్గొండలోని క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశంలో గుత్తా మాట్లాడారు. లౌకిక వాదులు గెలిచారని, బిజెపి నిరంకుశ విధానాలను మునుగోడు ప్రజలు తిప్పి కొట్టారన్నారు. మతోన్మాద విచ్ఛిన్నకర శక్తులకు చెంప పెట్టులా మునుగోడు తీర్పు వచ్చిందన్నారు. మునుగోడు ఎన్నికలు ప్రజల ఆకాంక్షలను వెల్లడించాయని, తెలంగాణలో విచ్చిన్నకర శక్తులకు స్థానం లేదని మరోసారి రుజువైందని, దేశానికి మార్గదర్శకంగా ఉండేలా రాజకీయం చేయాలన్నారు.

ఈ ఎన్నికల్లో కేంద్రం ఇన్ కంటాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళను కూడా వాడారని, ఇది అత్యంత దుర్మార్గమని మండిపడ్డారు. ఇప్పటికే ఇడి, సిబిఐలు నవ్వుల పాలయ్యారని చురకలంటించారు. ఇన్ కంట్యాక్స్ డిపార్ట్మెంట్ ను కూడా మోడీ ప్రభుత్వం దిగజార్చిందని గుత్తా ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ రాజకీయాల్లో సిఎం కెసిఆర్ అవసరం చాలా ఉందని, సామాన్య ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేలా కెసిఆర్ పాటుపడతున్నారన్నారు. కెసిఆర్ పై దేశ ప్రజలకు నమ్మకం పెరిగిందని, అన్ని రంగాల్లో తెలంగాణ నేడు నంబర్ వన్ స్థానంలో నిలిచిందని ప్రశంసించారు.

ఇవ్వాళ తెలంగాణ మోడల్ దేశానికి అవసరం ఉందని, ఈ ఎన్నికతో కోమటిరెడ్డి బ్రదర్స్ రాజకీయంగా ఆత్మహత్య చేసుకున్నారని గుత్తా ఎద్దేవా చేశారు. ప్రజలపై బలవంతంగా రుద్దిన మునుగోడు ఎన్నికలతో కోమటిరెడ్డి సోదరులు రాజకీయంగా నష్ట పోయారన్నారు. పన్నులు వేస్తూ ప్రజలను దోచుకుంటున్న బిజెపికి తగిన బుద్ధి చెప్పారని, సామాన్యులకు శరాఘాతంగా కేంద్ర పాలన మారిందని దుయ్యబట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News