మన తెలంగాణ/నల్లగొండ ప్రధాన ప్రతినిధి: రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అడ్డగోలుగా చేస్తున్న వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయని శాసన మండలి మాజీ చైర్మన్ ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి ఎద్దేవా చేశారు. జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటున్న రేవంత్ రెడ్డి మాటలు వింటుంటే నవ్వొస్తు౦దని, అడ్డగోలు మాటలు ప్రామాణికంగా నేల విడిచి సాము చేస్తున్న రేవంత్ కు ప్రజలే తగిన గుణపాఠo చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని, దిగజారి రాజకీయాలు చేస్తున్న రేవంత్ ను ప్రజలు బహిష్కరించే రోజు త్వరలోనే వస్తాయని స్పష్టం చేశారు.
శుక్రవారం నల్లగొండ లోని తన నివాసంలో నల్లగొండ జిల్లా పరిషత్ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి, టీఆర్ఎస్ జిల్లా నాయకులు యమా దయాకర్ లతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ముఖ్యమంత్రి కెసిఆర్ కుటుంబం టార్గెట్ గా నోటికొచ్చినట్లు అడ్డగోలుగా, వ్యక్తిగత విమర్శలు చేస్తున్న రేవంత్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలని హితవు పలికారు. ప్రాణాలు సైతం పణంగా పెట్టి పోరాడి సాధించుకున్న రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ గా మార్చేందుకు అహర్నిశలు పరితపిస్తున్న మహోన్నత వ్యక్తి కెసిఆర్ అని కొనియాడారు. రాష్ట్రంలో జరిగిన శాసన మండలి ఎన్నికల్లో 12 స్థానాల ఎన్నికల్లో కెల్లా తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థులు తిరుగులేని విజయం సాధించడం ప్రజల్లో టిఆర్ఎస్ కు, కెసిఆర్ కు అమితమైన అభిమానం స్పష్టమవుతుందన్నారు.
ముఖ్యమంత్రి కెసిఆర్ పై ప్రజల్లో, ప్రజాప్రతినిధుల్లో ఉన్న విశ్వాసం, నమ్మకం మరో సారి రుజువైందని వివరించారు. కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేయడంతో తెలంగాణలో రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసుకునే పరిస్థితి వచ్చిందని విమర్శించారు. జాతీయ బ్యాంక్ లను, ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తూ మోడీ అన్ని ప్రసంగాలను నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు. జాతీయ బ్యాంకులన్నీ 16 లక్షల కోట్ల లాభాలతో విజయవంతంగా ముందుకు సాగుతున్న తరుణంలో బ్యాంక్ లను అమ్మడం బిజెపి ప్రభుత్వ వైఫల్యానికి నిలువెత్తు నిదర్శనమని అభివర్ణించారు. దుర్మార్గపు విధానాలతో బిజెపి దేశాన్ని అంబానీ లకు, ఆదానిలకు అమ్ముతోందని, పబ్లిక్ రంగ సంస్థలను అమ్మే విధానాలను బిజెపి ప్రభుత్వం విడనాడాలని హితవు పలికారు. ప్రజలపై భారం వేస్తూ పేదరికాన్ని పెంచుతున్న కేంద్రం తీరు బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.