నల్లగొండ: కృష్ణా నీటిని 1956 నుంచే ఆంధ్రప్రదేశ్ దోపిడీ చేస్తోందని ఎంఎల్‌సి గుత్తా సుఖేందర్ రెడ్డి మండిపడ్డారు. నల్లగొండలో గుత్తా మీడియాతో చిట్ చాట్ చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ వాదులకు విలువ, గౌరవం లేదన్నారు, దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్ హయాం నుంచే 55 వేల క్యూసెక్కుల నీటిని ఆంధ్రోళ్లు దోపిడీ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిఎం జగన్ మోహన్ రెడ్డి కూడా కృష్ణా జలాలను దోచుకోవాలని చూస్తున్నారని, జగన్ దొంగ చాటుగా పనులు చేయడం సరికాదన్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకంతో తెలంగాణకు నష్టం వాటిల్లిందన్నారు. ఆనాడు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఆంధ్రా నాయకులకు లొంగిపోయారని, బిజెపి నాయకులది కాకి గోల మాత్రమేనని, వాళ్లతో ఏ పని జరగదని ఎద్దేవా చేశారు. చిత్తశుద్ధితో తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టులను పూర్తి చేస్తోందని ప్రశంసించారు. విభజన చట్టాన్ని అమలు చేయని బిజెపికి మాట్లాడే అర్హత లేదన్నారు. రెండు రాష్ట్రాల సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత కేంద్రానిదేనని, టిపిసిసి అధ్యక్షుడుగా నియమించబడిన రేవంత్ రెడ్డి కూడా ఉత్తర కుమారుడేనని గుత్తా విమర్శలు గుప్పించారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం అనేది ఓ కల అని చురకలంటించారు. రేవంత్ రెడ్డి పగటి కలలు కంటున్నారని, కాంగ్రెస్ కలహాలు సరిదిద్దడానికి రేవంత్‌కు సమయం సరిపోదన్నారు.
వైఎస్ఆర్ నుంచే నీటిని దోచుకుంటున్నారు: గుత్తా
- Advertisement -
- Advertisement -
- Advertisement -