Monday, November 25, 2024

నేను పార్టీ మారే ప్రసక్తే లేదు: గుత్తా సుఖేందర్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

నల్లగొండ : తాను పార్టీ మారుతున్నట్లు సోషల్ మీడియాలో కావాలనే పనిగట్టుకుని మరీ దుష్ప్రచారం చేస్తున్నారని, కానీ తాను పార్టీ మారే ప్రసక్తే లేదని శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం నల్లగొండలోని తన క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో చిట్ చాట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను రాజ్యాంగబద్ధ్దమైన శాసన మండలి ఛైర్మన్ పదవిలో ఉన్నానని అంటూనే తనకు ఏ పార్టీతో సంబంధం లేదని, చట్టబద్ధంగా తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తానని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే తన ధ్యేయమని, అధికారం ఎవరికీ శాశ్వతం కాదన్నారు. నూతన ప్రభుత్వానికి అవసరమైన సలహాలు, సూచనలు అందిస్తామని అన్నారు. రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం కూడా పథకాల అమలు విషయంలో సాధ్యాసాధ్యాలను బేరీజు వేసుకోవాలని, ప్రజలకు వాస్తవ పరిస్థితులను వివరిస్తూ పథకాలను అమలు చేయాలని సూచించారు.

కేసీఆర్ పట్ల ప్రజలకు ఎలాంటి వ్యతిరేకత లేదు
ప్రజలు బీఆర్‌ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఎందుకు తీర్పు ఇచ్చారనేది అధిష్టానం విశ్లేషణ చేసుకుంటుందని అన్నారు. కేసీఆర్ పట్ల ప్రజలకు ఎలాంటి వ్యతిరేకత లేదని అన్నారు. గతంలో మాదిరిగానే కేసీఆర్ పట్ల ప్రజలకు పేమ, విశ్వాసం అలాగే ఉన్నాయన్నారు. కేసీఆర్ సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా బయటకు రావాలని తాను భగవంతున్ని ప్రార్ధిస్తున్నట్లు ఆయన తెలిపారు. కేసీఆర్ రావాలి, మా ఎమ్మెల్యే పోవాలి అన్న విధంగా ప్రజలు ఓట్లు వేశారని ఆయన అభిప్రాయపడ్డారు. కొన్ని స్థానాలలో అభ్యర్దులను మార్చితే ఈసారి కూడా బిఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చేదని చెప్పారు.కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు నమ్మి ప్రజలు ఓట్లు వేయలే..కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు నమ్మి ప్రజలు ఓట్లు వేశారని తాను అనుకోవడం లేదని అన్నారు. జిహెచ్‌ఎంసి పరిధిలో మాత్రం అక్కడి ఎమ్మెల్యే, కేటీఆర్ పని తీరుకు మాత్రమే ఓట్లు పడ్డాయని చెప్పుకొచ్చారు.

మంత్రులు చేస్తున్న కామెంట్స్‌ను తాను పేపర్లలో చూస్తున్నానని అంటూనే విమర్శ, ప్రతి విమర్శలకు ఇప్పుడు సమయం కాదన్నారు. రాష్ట్రంలోని పెండింగ్ పనులను పూర్తి చేస్తూ పక్కా ప్రణాళిక, కార్యాచరణతో మంత్రులు పని చేసుకుంటూ ముందుకు సాగాలని ఆయన హితవు పలికారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు రెండు మంత్రి పదవులు రావడం సంతోషదాయకమని అన్నారు. ఇద్దరు మంత్రులు కూడా జిల్లా అభివృద్ధికి కృషి చేయాలని ఆయన ఆకాంక్షించారు. జిల్లాలో ఇరిగేషన్ పనులు చాలా పెండింగ్‌లో ఉన్నాయన్నారు. పెండింగ్ పనుల విషయంలో మంత్రి కొంత సమయం కేటాయించి రివ్యూ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇకపోతే జిల్లాలో రహదారుల అభివృద్ధికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కృషి చేస్తారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News