హైదరాబాద్: నిన్న ఢిల్లీ లో రైతుల కోసం విజయవంతంగా ధర్నా నిర్వహిస్తే బిజెపి నేతలు ఓర్చుకోలేక పోతున్నారని ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు మండిపడ్డారు. ధర్నా ద్వారా కేంద్రం మమ్మల్ని ఏం పీకుతుందో పీకమని కెసిఆర్ నిన్న స్పష్టంగా సవాల్ విసిరాడని గుర్తు చేశారు. ధర్నా ద్వారా ఏం పీకారని బండి సంజయ్ మాట్లాడిన దానికి ముందే కేసీఆర్ బదులిచ్చారన్నారు. ఒకటి రెండు విజయాలు సాధించగానే బిజెపి నేతలు ఎగిరెగిరి పడుతున్నారని, తెలంగాణలో టిఆర్ఎస్ సాధించిన విజయాల ముందు బిజెపి సాధించింది ఎంత అని కడిగిపడేశారు. బిజెపి సిట్టింగ్ గ్రాడ్యుయేట్ స్థానం కోల్పోలేదా?, హుజూర్ నగర్ ఉపఎన్నికలో బిజెపి సాధించిన ఓట్లు ఎన్నిఅన్ని అడిగారు.
హుజూర్ నగర్ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ బిజెపికి అమ్ముడు పోయిందని, ఢిల్లీ స్థాయిలో కాంగ్రెస్ రైతుల కోసం ఏ ఆందోళన చేసిందని ప్రశ్నించారు. ఐదు రాష్ట్రాల్లో కాంగ్రెస్ చేతకాని తనమే బిజెపిని గెలిపించదన్నారు. రాహుల్ కు మోడీ ని ఎదుర్కొనే దమ్ముందా? అని అడిగారు. అంబేడ్కర్ జయంతి రోజున బండి సంజయ్ పాదయాత్ర మొదలు పెట్టడం ఆ మహనీయుడి ఆత్మను క్షోభ పెట్టడమేనన్నారు. బండి సంజయ్ ను రైతులే నిలదీస్తారని, మత కల్లోలాలు రేపడం తప్ప బిజెపికి ఏం చేతకాదన్నారు. వ్యవసాయ చట్టాల పై ఆందోళన చేస్తున్న 750 మంది రైతులను బిజెపి చంపిందన్నారు. రేపు తెలంగాణ రైతుల ఆగ్రహం పెరిగితే బండి సంజయ్ ను రాళ్లతో కొట్టి చంపడం ఖాయమని హెచ్చరించారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వాన్ని గద్దె దింపుతామని హెచ్చరించారు.