హైదరాబాద్: మాజీ మంత్రి ఈటెల రాజేందర్ వ్యాపారానికి అసైన్డ్ భూములు మాత్రమే దొరికాయా? అని ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు ప్రశ్నించారు. కొనుక్కునే ఉద్దేశం ఉంటే వేరే భూములే దొరకలేదా? నిలదీశారు. అసైన్డ్ భూముల యజమానులపై ఈటెల దౌర్జన్యం చేశారు కాబట్టే ఆ ఫిర్యాదులపై సిఎం కెసిఆర్ అన్ని చర్యలు తీసుకున్నారన్నారు. ఈటెల రాజేందర్ తన ఎంఎల్ఎ పదవికి, టిఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన సందర్భంగా గువ్వల మీడియాతో మాట్లాడారు. తామంతా సిఎం కెసిఆర్ ఆశయాలను నెరవేర్చడమే లక్ష్యంగా పని చేస్తున్నామని, ఈటెల మాత్రం తమ ఆస్తులను పెరగడానికి ఉపాయం ఏందో ప్రజలకు చెప్పాలని గువ్వల మండిపడ్డారు.
ఈటెలకు గౌరవం ఇచ్చింది సిఎం కెసిఆరేనని చెప్పారు. బాధితులు ఫిర్యాదుతోనే బాధ్యతగల ముఖ్యమంత్రి విచారణ జరిపించారని గుర్తు చేశారు. ఈటెల ఆస్తుల గ్రాఫ్ విపరీతంగా పెరగడానికి కారణమేంటో చెప్పాలని, సిఎం కెసిఆర్ తీసుకున్న నిర్ణయం సరైనదేనని, ఈటెల చేసిన పాపాలను చట్టం గమనిస్తోందని, డిల్లీ వెళ్లినా చట్టం నుంచి ఆయనను ఎవరు కాపాడలేరన్నారు.