సర్వే నివేదికను 4 వారాలపాటు తెరవొద్దు
జ్ఞానవాపి కేసులో కోర్టును కోరిన ఎఎస్‌ఐ
న్యూఢిల్లీ: జ్ఞానవాపి మసీదు కాంప్లెక్స్‌పై తాము ఇచ్చిన సర్వే నివేదికను కనీసం నాలుగు వారాలపాటు వెల్లడించవద్దని భారత పురావస్తు పరిశోధనా సంస్థ(ఎఎస్‌ఐ) బుధవారం వారణాసి కోర్టును అర్థించినట్లు హిందువుల తరఫు న్యాయవాది తెలిపారు. దీంతో వారణాసి జిల్లా కోర్టు జడ్జి ఎకె విశ్వేశ్ కేసు విచారణను గురువారానికి వాయిదా వేసినట్లు న్యాయవాది మదన్ మోహన్ యాదవ్ తెలిపారు. తాము సీల్డ్ కవర్‌లో ఇచ్చిన సర్వే నివేదికను కనీసం నాలుగు వారాలపాటు తెరవవద్దని ఎఎస్‌ఐ కోర్టును అర్థించినట్లు న్యాయవాది తెలిపారు.
డిసెంబర్ 18న ఎఎస్‌ఐ సీల్డ్ కవర్‌లో సర్వే నివేదికను కోర్టుకు సమర్పించింది. 17వ శతాబ్దానికి చెందిని జ్ఞానవాపి మసీదును అక్కడ అప్పటికే ఉన్న ఆలయంపై నిర్మించారని పిటిషనర్లు వాదించడంతో కోర్టు సర్వేకు ఆదేశించింది. కాశీ విశ్వనాథ ఆలయం పక్కన మసీదు కాంప్లెక్స్ ఉంది. హిందూ ఆలయంపైన మసీదును నిర్మిచారా లేదా అన్న విషయాన్ని శాస్త్రీయ పద్ధతిలో నిర్ధారణ చేయాలని ఎఎస్‌ఐని జిల్లా కోర్టు జులైన ఆదేశించింది. మసీదు గుమ్మటాలు, సెల్లార్లు, పశ్చిమ గోడ కింద సర్వే చేయాల్సిన అవసరం ఉందని కోర్టు సూచించింది.