న్యూఢిల్లీ: భారతీయ జిమ్నాస్ట్ దీపా కర్మాకర్‌పై 21 నెలల నిషేధం విధించారు. నిషేధిత ఉత్ప్రేరకాలు వాడినట్లు ఆమెపై ఆరోపణలు ఉన్నాయి. ఈ ఏడాది జూలై 10వ తేదీ వరకు ఆమెపై నిషేధం అమలులో ఉంటుందని ఇంటర్నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించింది. నిషేధిత ఉత్ప్రేరకం హిగనమైన్ పరీక్షలో ఆమె పాజిటివ్‌గా తేలినట్లు అధికారులు నిర్ధారించారు. దీంతో ఆమె డోపింగ్‌కు పాల్పడినట్లు రుజువైంది. వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ ప్రకారం హిగనమైన్ నిషేధిత లిస్టులో ఉంది. ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డీ జిమ్నాస్టిక్ సేకరించిన శ్యాంపిల్ పరీక్షలో దీపా కర్మాకర్ పాజిటివ్‌గా తేలింది. 2021 అక్టోబర్ 11వ తేదీన ఆమె వద్ద శ్యాంపిల్ సేకరించారు. అయితే అప్పటి నుంచి ఆమె పాల్గొన్న అన్ని టోర్నీల్లోని ఫలితాలను డిస్‌క్వాలిఫై చేశారు.
హిగనమైన్ ఉత్ప్రేరకాన్ని 2017లో వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ నిషేధిత జాబితాలో చేర్చింది. యాంటీ డోపింగ్ రూల్స్ ద్వారా కేసును పరిష్కరించారు. నిషేధం వల్ల 29 ఏళ్ల దీపా.. చాలా టోర్నీలు మిస్‌కానున్నది. అపారటస్ వరల్డ్ కప్ సిరీస్‌తో పాటు కనీసం మూడు వరల్డ్‌కప్ సిరీస్‌లకు కూడా దీప దూరం కానున్నది. అయితే సెప్టెంబర్ 23వ తేదీ నుంచి ఆంట్‌వెర్ప్‌లో జరగనున్న వరల్డ్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి.