పైలట్ ప్రోగ్రామ్‌కు అమెరికా అంగీకారం
వాషింగ్టన్: అమెరికాలో పనిచేస్తున్న భారతీయ టెక్నాలజీ ప్రొఫెషనల్స్‌కు అమెరికా ప్రభుత్వం శుభవార్త చెప్పింది. క్వాలిఫైడ్ హెచ్ 1బి వీసా దరఖాస్తుదారుల కోసం డొమెస్టిక్ వీసా రెన్యూవల్‌ను పునరుద్ధరించేందుకు ప్రయోగాత్మక కార్యక్రమాన్ని చేపట్టడానికి వైట్ హౌస్ పరిధిలో పనిచేసే ఆఫీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ రెగ్యులేటరీ అఫేర్స్(ఓఐఆర్‌ఎ) అంగీకరించింది. సాంకేతిక లేదా థియరిటికల్ నైపుణ్యం గల ప్రత్యేక వృత్తులలో విదేశీ ఉద్యోగులను అమెరికన్ కంపెనీలు నియమించుకోవడానికి అనుమతినిచ్చే హెచ్ 1బి వీసా నాన్ ఇమిగ్రంట్ వీసా కిందకు వస్తుంది.
భారత్, చైనా వంటి దేశాల నుంచి వేలాది మంది ఉద్యోగులను నియమించుకునేందుకు టెక్నాలజీ కంపెనీలు ఈ వీసాపై ఆధారపడతాయి. భారత ప్రధాని నరేంద్ర మోడీ జూన్‌లో అమెరికా పర్యటించిన సందర్భంగా ఈ పైలట్ కార్యక్రమాన్ని వైట్ హౌస్ ప్రకటించింది. ప్రాథమికంగా 20,000 దరఖాస్తులకు ఈ పైలట్ కార్యక్రమాన్ని పరిమితం చేసింది. డిసెంబర్ 15న ఓఐఆర్‌ఎ సమీక్షించి ఈ కార్యక్రమాన్ని ఆమోదించింది.
కాగా, క్వాలిఫైడ్ హెచ్ 1బి దరఖాస్తుదారులు వర్క్ వీసా కోసం విదేశానికి ప్రయాణించవలసిన అవసరం లేదు. డిసెంబర్‌లో ప్రారంభించి మొదటి మూడు నెలల్లో ఇప్పటికే అమెరికాలో ఉన్న విదేశీ జాతీయులకు 20,000వీసాలను విదేశాంగ శాఖ జారీచేయనున్నది. మొదటి జట్టులో 20,000 వీసాలు జారీ చేస్తామని, వీరిలో అత్యధికులు అమెరికాలో నివసించే భారత జాతీయులు ఉంటారని, రానున్న కాలంలో దీన్ని మరింత విస్తరిస్తామని విదేశాంగ శాఖ తెలిపింది.