వాషింగ్టన్ : 2025 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన హెచ్ 1బి వీసా దరఖాస్తులు దాఖలు చేయడానికి ఆన్‌లైన్ ప్రక్రియ వచ్చే ఫిబ్రవరిలో మొదలవుతుందని అమెరికా పౌరసత్వం, ఇమ్మిగ్రేషన్ సేవల సంస్థ (యుఎస్‌సిఐఎస్) ప్రకటించింది. సంస్థాగత పద్దులను యుఎస్‌సిఐఎస్ ప్రవేశపెట్టడంతో హెచ్ 1బి నమోడు ప్రక్రియ సులభతరం అయింది. సంస్థాగత పద్దుల వల్ల ఒక కంపెనీ లేక ఇతర వ్యాపార సంస్థతో సహా ఒక సంస్థలోని పలువురు వ్యక్తులు, వారి న్యాయ సలహాదారులు హెచ్ 1బి రిజిస్ట్రేషన్లు, ఫార్మ్ I-129 (నాన్ ఇమ్మిగ్రంట్ వర్కర్), అనుబంధ ఫార్మ్ I907 (ప్రీమియం ప్రాసెసింగ్ సర్వీస్ కోసం అభ్యర్థన) తయారీ విషయంలో సహకరించేందుకు వీలు కలుగుతుందని యుఎస్‌సిఐఎస్ తన వెబ్‌సైట్‌లో వివరించింది.
‘యుఎస్‌సిఐఎస్ మా ప్రక్రియలను మెరుగుపరిచేందుకు, క్రమబద్ధీకరించేందుకు సదా పాటుపడుతోంది. ఇది ఆ దిశగా ఒక పెద్ద అడుగు’ అని యుఎస్‌సిఐఎస్ డైరెక్టర్ ఎం. జద్దౌ తెలియజేశారు. ‘ఒకసారి మేము సంస్థాగత పద్దులను, I-129 హెచ్ 1బి పిటిషన్ల ఆన్‌లైన్ దాఖలును ప్రారంభించిన తరువాత మొత్తం హెచ్ 1బి లైఫ్‌సైకిల్ నమోదు ప్రక్రియ నుంచి మా తుది నిర్ణయం వరకు, విదేశాంగ శాఖకు బదలాయింపు వరకు పూర్తిగా ఎలక్ట్రానిక్‌గా మారిపోతుంది’ ఆయన తెలిపారు. ఈ నెలాఖరుకల్లా సంస్థాగత పద్దులు లభ్యత, హెచ్ 1బి కోసం తేదీలకు సంబంధించిన సమాచారాన్ని లాంఛనంగా వెల్లడించగలమని యుఎస్‌సిఐఎస్ భావిప్తోంది’ అని డైరెక్టర్ తెలిపారు.