వాషింగ్టన్: ఈ ఏడాది అక్టోబరు నుంచి మొదలయ్యే ఆర్థిక సంవత్సరానికి గాను హెచ్-1బి వీసాల దరఖాస్తులను ఈ ఏడాది మార్చి 1 నుంచి స్వీకరించనున్నట్లు అమెరికా పౌరసత్వ, వలస సేవల సంస్థ(యుఎ్‌ససిఐఎస్) శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. మార్చి 18వ తేదీ వరకూ వాటి స్వీకరణ కొనసాగుతుందని వెల్లడించింది. తమకు వచ్చిన ప్రతి దరఖాస్తుకు ఒక కన్ఫర్మేషన్ సంఖ్యను జతచేస్తామని, వాటి ఆధారంగా రిజిస్ట్రేషన్ల పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చని పేర్కొంది. ప్రస్తుత విధానం ప్రకారం.. దరఖాస్తుదారులు ఆన్‌లైన్‌లో రిజిస్టర్ చేసుకుని రూ. 750 (10 డాలర్లు) రుసుము చెల్లించాల్సి ఉంటుంది. తుది గడువు అనంతరం ఏవైనా కొన్నింటిని ఎంపిక చేసి, మార్చి 31కల్లా ఆ విషయాన్ని వాటి దరఖాస్తుదారులకు తెలియపరుస్తామని యుఎ్‌ససీఐఎస్ పేర్కొంది. ప్రతీ ఏటా అమెరికా 65వేల కొత్త హెచ్-1బీ వీసాలను జారీ చేస్తుంటుంది. మొత్తం వీసాల్లో 70శాతానికి పైగా భారతీయులే దక్కించుకుంటుండటం విశేషం.