బెంగళూరు: మహిళా ఎంపిపై మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు కన్నడ రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపాయి. మాండ్య పార్లమెంటరీ నియోజకవర్గానికి సుమలత ఎంపిగా ఉన్నారు. మాండ్య జిల్లాలోని కృష్ణరాజసాగర్ డ్యామ్ గేట్లు లీక్ కావడంతో నీరు వృధాగా పోతుంది. కృష్ణరాజసాగర్(కెఆర్‌ఎస్) జలాశయం చుట్టూ గనుల తవ్వకంతో పాటు అక్రమంగా ఇసుకను తరలిస్తుండడంతోనే డ్యామ్‌కు పగుళ్లు ఏర్పడ్డాయని ఎంపి సుమలత ఆరోపణలు చేశారు. దీనిపై మాజీ సిఎం కుమారస్వామి స్పందించారు. కెఆర్‌ఎస్ డ్యామ్ గేట్ల లీకేజీని అరికట్టడానికి సుమలతను అడ్డుగా పడుకోబెడితే సరిపోతుందని వివాదస్పద వ్యాఖ్యలు చేయడంతో కన్నడ రాజకీయాల్లో దూమారం రేపుతున్నాయి.
గతంలో రాష్ట్రానికి సిఎంగా ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడమేంటని మహిళ సంఘాలు, బిజెపి నేతలు మండిపడుతున్నారు. మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా అని సుమలత ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళపై అసభ్యపదజాలం వాడిన వ్యక్తి సిఎంగా ఎలా పని చేశారని దుయ్యబట్టారు. తాను కూడా దిగజారి మాట్లాడితే తనకు, ఆయనకు తేడా ఏముంటుందన్నారు. మహిళపై వ్యక్తిగత దాడికి దిగడం సరైన విషయం కాదన్నారు. మండ్యలో అక్రమ మైనింగ్‌కు పాల్పడింది ఎవరనేది బహిరంగ రహస్యమని ఎద్దేవా చేశారు. మాండ్య పార్లమెంటరీ ఎన్నికలలో మాజీ సిఎం కుమారా స్వామి తనయుడు నిఖిల్‌పై సుమలత విజయం సాధించడంతో ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటారని భావిస్తున్నారు.