చత్తీస్‌గఢ్‌లో సంయుక్త బృందం ఆపరేషన్
రాయ్‌పూర్ : చత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా పువర్తి గ్రామంలో పోలీసు బలగాల ప్రత్యేక క్యాంపు ఏర్పాటు అయింది. అత్యంత కరడుగట్టిన నక్సలైట్ నేత హిద్మా స్వస్థలం పువర్తి గ్రామం. ఇక్కడ ఆయన దళం కదలికల గురించి సమాచారం అందడంతో చత్తీస్‌గఢ్ పోలీసు బెటాలియన్లు పెద్ద ఎత్తున మొహరించాయి. బస్తర్ ప్రాంతంలో తరచూ భద్రతా బలగాలపై అత్యంత వ్యూహాత్మక , భయానక దాడులకు హిద్మానే కేంద్ర బిందువు అని స్పష్టం అయింది. వామపక్ష తీవ్రవాదం అణచివేతకు భద్రతా బలగాలు తీసుకుంటున్న చర్యలలో హిద్మా గ్రామం వద్ద పోలీసు చెక్‌పోస్టు ఏర్పాటు అత్యంత కీలక పరిణామంగా మారింది. ప్రత్యేకించి నక్సలైట్లపై తలపెట్టిన మానసిక కుంగుబాటు యుద్ధతరహా నీతిలో ఇది కీలకం అని వెల్లడైంది. ఇక్కడ వెలిసిన క్యాంపు అత్యంత శక్తివంతమైనది.
ఈ క్యాంపులో రాష్ట్ర ఎస్‌టిఎఫ్, రిజర్వ్ గార్డు(డిఆర్‌జి), బస్తర్ ఫైటర్స్ దళంతో పాటు సిఆర్‌పిఎఫ్, సుశిక్షిత కోబ్రా బలగాలు, స్థానిక పోలీసు బృందాలు ఉంటాయి. జగర్‌గుండా పోలీసు స్టేషన్ పరిధిలోని ఈ గ్రామంలో ఈ జాయింట్ టీం క్యాంపు ఏర్పాటు చేసినట్లు ఆదివారం బస్తర్ ప్రాంత పోలీసు ఐజి పి సుందర్‌రాజ్ తెలిపారు. హిడ్మా స్వగ్రామం సుక్మా, బీజాపూర్ జిల్లాల సరిహద్దుల్లో ఉంది. ఇక్కడి నుంచే ఆయన తన దళాలతో పెద్ద ఎత్తున చాకచక్యంగా భద్రతా బలగాలపై దాడులకు కార్యాచరణకు దిగడం జరుగుతోందని పసికట్టారు.
ఇటువంటి పలు దాడుల క్రమంలో భద్రతా బలగాలు భారీగా నష్టపొయ్యాయి. దీనిని నివారించేందుకు ముందుగా ఈ కేంద్ర బిందువును టార్గెట్ చేసుకోవాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. మావోయిస్టుల పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ(పిఎల్‌జిఎ) దక్షిణ బస్తర్‌లో పలు దాడులకు పాల్పడింది. ఈ దళానికి చాలాకాలం హిడ్మా అధినేతగా ఉన్నారు. గత నెలలోనే ఈ కీలక దళం ప్రత్యక్ష బాధ్యతలను బర్సే దేవా తీసుకున్నాడు. కాగా హిద్మా మావోయిస్టుల కేంద్ర కమిటీకి పదోన్నతి పొందారు.