భారత హోం శాఖ ప్రకటన
న్యూఢిల్లీ: లష్కరే తాయిబా వ్యవస్థాపకుడు, 26/11 ముంబయి ఉగ్ర దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్ కుమారుడు హఫీజ్ తల్హా సయీద్‌ను ఉగ్రవాదిగా ప్రభుత్వం ప్రకటించింది. భారత్‌లోను, అఫ్ఘానిస్తాన్‌లోని భారతీయ ప్రయోజనాలోను దాడులకు కుట్రలు పన్ని వాటిని నిర్వహించేందుకు కేడర్ నియామకం, నిధుల సమీకరణలో చురుకుగా పాల్గొంటున్న 46 ఏళ్ల హఫీజ్ తల్హా సయీద్‌ను ఉగ్రవాదిగా ప్రకటిస్తున్నట్లు కేంద్ర హోం మంత్రిత్వశాఖ శనివారం ఒక నోటిఫికేషన్‌లో పేర్కొంది. పాకిస్తాన్ వ్యాప్తంగా వివిధ లష్కరే తాయిబా కేంద్రాలను హఫీజ్ తల్హా సయీద్ విస్తృతంగా సందర్శిస్తున్నాడని, భారత్, ఇజ్రేల్, అమెరికా, పశ్చిమ దేశాలలోని భారతీయ ప్రయోజనాలకు వ్యతిరేకంగా అతను ప్రచారం సాగిస్తున్నాడని కేంద్రం తెలిపింది. తల్హా సయీద్ తండ్రి హఫీజ్ సయీద్ 2008 నవంబర్ 26న జరిగిన ముంబయి ఉగ్ర దాడుల ప్రధాన సూత్రధారి. కొన్నేళ్ల క్రితం అతడిని ఉగ్రవాదిగా భారత్ ప్రకటించింది. ప్రస్తుతం అతను ఉగ్ర ఆరోపణలపై పాకిస్తాన్ జైలులో ఉన్నాడు. అతడిని తమకు అప్పగించాలని భారత్ ఎన్నిసార్లు కోరినప్పటికీ పాకిస్తాన్ మాత్రం నిరాకరిస్తోంది.