ఆదిలాబాద్ జిల్లా జైనద్‌లో అత్యధికంగా
43.6 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదు
హైదరాబాద్: భానుడి భగభగలతో ప్రజలు అవస్థలు ఎదుర్కొంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వీస్తున్న వడగాల్పులతో ప్రజలు బయటకు రావాలంటే భయపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే మండుతున్న ఎండలతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. పగటిపూటే కాదు రాత్రి ఉష్ణోగ్రతలు కూడా అసాధారణంగా పెరుగుతుండడంతో ఉక్కపోతతో ప్రజలు నిద్రలేని రాత్రులను గడుపుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ చూసినా నిప్పుల కొలిమిలో ఉన్నట్టుగా అనిపిస్తోంది. బుధవారం ఆదిలాబాద్ జిల్లా జైనద్‌లో అత్యధికంగా 43.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్ అర్భన్ మండలంలో 43.4 డిగ్రీలు, నిజామాద్ రూరల్ 42.1, నిజామాబాద్ డిచ్‌పల్లిలో 41.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయని వాతావరణ శాఖ తెలిపింది.
ఉదయం 11 గంటల నుంచే రోడ్లన్నీ ఎండ తీవ్రతకు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. అత్యవసర పనులకు తప్పితే జనాలు బయటకు రావడం లేదు. ఎండ వేడిమిని తట్టుకోలేక కొబ్బరి బొండాలు, జ్యూసులు తాగుతూ ఉపశమనం పొందుతున్నారు. మరోవైపు రాత్రి ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరిగాయి. ఆదిలాబాద్‌లో ఆదివారం రాత్రి గరిష్టంగా 28 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు కాగా భద్రాచలం, నిజామాబాద్‌లలో 27, హైదరాబాద్, ఖమ్మం, రామగుండంలో 26, దుండిగల్‌లో 25, హన్మకొండలో 24 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. సాధారణంగా చలికాలం, వర్షాకాలంలో పగటి పూట ఈ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి.