రెండురోజుల పాటు మరింత అప్రమత్తంగా ఉండాలి
వాతావరణ శాఖ హెచ్చరిక
మనతెలంగాణ/హైదరాబాద్: రానున్న రెండు రోజులు రాష్ట్ర వ్యాప్తంగా వడగాల్పులు పెరగతాయని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. ఈ వడగాల్పులు తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో వీస్తాయని ఐఎండి పేర్కొంది. రాజస్థాన్, జమ్మూకశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్, గుజరాత్, పశ్చిమ మధ్యప్రదేశ్, విదర్భ, ఒడిశా, కొంకణ్ ప్రాంతంలో కూడా అధికంగా వేడిగాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
శిశువులు, వృద్ధులతో పాటు దీర్ఘకాలిక…
ఈ నేపథ్యంలో ముఖ్యంగా శిశువులు, వృద్ధులతో పాటు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వ్యక్తులకు ఇబ్బందికరంగా మారుతుందని వాతావరణ శాఖ పేర్కొంది. ఎక్కువసేపు ఎండలో ఉంటే ఎండదెబ్బకు గురయ్యే అవకాశం ఉంటుందని, వేడిగాలుల కారణంగా అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొంది. ఎండదెబ్బకు గురికాకుండా పలు జాగ్రత్తలు పాటించాలని వాతావరణ శాఖ సూచించింది. శరీరాన్ని చల్లగా ఉంచుకోవాలని, దాహం వేయకపోయినా తగినంత నీరు తాగాలని తెలిపింది. తేలికైన, లేత రంగు, వదులుగా ఉండే కాటన్ దుస్తులను ధరించాలని, బయటకు వెళ్లే సమయంలో తలకు టోపీ ధరించాలని లేదంటే గొడుగైనా తీసుకెళ్లాలని సూచించింది. లస్సీ, నిమ్మ రసం, మజ్జిగ వంటి పానీయాలను తీసుకోవాలని వాతావరణ శాఖ పేర్కొంది.
ఖడాంతర గాలులే కారణం..
మార్చి నెలలో మధ్య భారతంలో హీట్‌వేవ్స్‌కు దక్షిణ ఖడాంతర గాలి కారణమని ఐఎండి తెలిపింది. రెండురోజులుగా సౌరాష్ట్ర, కచ్, కొంకణ్, పశ్చిమ రాజస్థాన్‌లో తీవ్రమైన హీట్‌వేవ్ పరిస్థితులను వాతావరణశాఖ అంచనా వేస్తోంది. దేశవ్యాప్తంగా హీట్‌వేవ్ పరిస్థితులపై వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. గుజరాత్, ముంబైలో ఎల్లో, ఆరెంజ్ అలెర్ట్‌ను జారీ చేసింది. వచ్చే ఐదురోజుల్లో కేరళలో తేలికపాటి వర్షం మినహా దేశం లోని చాలా ప్రాంతాల్లో వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మార్చి 17 నుంచి -19వ తేదీల మధ్య దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక మీదుగా, 18,-19 తేదీల్లో తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్ మీదుగా నైరుతి బంగాళాఖాతం, హిందూ మహాసముద్రంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.