ఎయిర్‌పోర్ట్‌లో ఏర్పాట్లు పూర్తి
హైదరాబాద్ : హజ్ యాత్రను విజయవంతంగా పూర్తి చేసుకొని ఈ నెల 15 నుండి రాష్ట్రానికి చెందిన హజ్ యాత్రికుల తిరుగు పయనం అవుతున్నారు. ఇందుకు సంబంధించి రాష్ట్ర హజ్ కమిటి ఇప్పటికే అన్ని ఏర్పాట్ల చేసింది. ఈ నెల 15 నుండి 30వ తేదీ వరకు ప్రతి రోజు రెండు ప్రత్యేక విమానాల్లో హజ్ యాత్రికులు హైదరాబాద్ చేరుకోనున్నారు. వారిని స్వాగతం పలికేందుకు విమానాశ్రయానికి వెళ్లే కుటుంబ సభ్యుల కోసం ఎయిర్‌పోర్ట్ అధికారులు ఏర్పాట్లు చేసినట్లు హజ్ కమిటి అధికారులు వెల్లడించారు.
ముఖ్యంగా హజ్ యాత్రికులు తెచ్చే జమ్ జమ్ ( పవిత్ర జలం) నీటిని ఉంచేందుకు కూడా ఏర్పాట్లు చేశారు. మక్కాలో ఉన్న హజ్ యాత్రికులు మదీనాకు పయనం అవుతున్నారు. ఇప్పటికే చాలా మంది మదీనాకు చేరుకున్నారు. మదీనాలో వారం రోజులు ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని బృందాల వారిగా హైదరాబాద్‌కు తిరుగు పయనమవుతారన్నారు. ఈ సంవత్సరం తెలంగాణ హజ్ కమిటి ద్వారా రాష్ట్రానికి చెందిన 5,583 మంది యాత్రికులు హజ్‌కు వెళ్ళగా రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మొత్తం 7,060 మంది హజ్ కు వెళ్ళినట్లు అధికారులు తెలిపారు. వారిలో కర్ణాటక, మహారాష్ట, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఛత్తీస్‌ఘడ్, జార్ఖండ్, తమిళనాడు రాష్ట్రాలోని పలు ప్రాంతాలకు చెందిన యాత్రికులు కూడా ఉన్నారు.
మక్కాలో నలుగురు తెలంగాణ వాసులు మృతి
రాష్ట్రం నుండి హజ్ యాత్రకు వెళ్ళిన వారిలో నలుగురు యాత్రికులు మక్కాలో మృత్యువాత పడ్డారు. అనారోగ్య కారణాల వల్ల మక్కాలోని ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మరణించారని అధికారులు తెలిపారు. మరో ఇద్దరు యాత్రికులు ఆక్కడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరణించిన వారిలో మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన శంశీర్ పాషా, రంగారెడ్డి జిల్లాకు చెందిన షేక్ రసూల్ , అహ్మద్ బిన్ సాలెం, నిజామాబాద్ జిల్లాకు చెందిన సయ్యద్ అబ్దుల్ ఖుద్దూస్ లు ఉన్నారు. వారి అంత్యక్రియలు మక్కాలోనే జరిపారు.