Monday, December 16, 2024

దరఖాస్తు చేసుకున్న అందరికీ హజ్ యాత్రకు అవకాశం..!

- Advertisement -
- Advertisement -

861కి తగ్గిన వెయిటింగ్ లీస్ట్
17న జిల్లా హజ్ కమిటీల సమావేశం
22న తొలి హజ్ శిక్షణా శిబిరం

మన తెలంగాణ / హైదరాబాద్ : దరఖాస్తు చేసుకున్న వారందరికీ ఈ సారి హజ్ యాత్రకు అవకాశం లభించనుంది. అదే జరిగితే ఇది రాష్ట హజ్ కమిటీ చరిత్రలో అద్భుతం అని చెప్పవచ్చు. రాష్ట్ర హజ్ కమిటీ ద్వారా హజ్ యాత్ర కోసం మక్కాను దర్శించుకునే అవకాశం లభించడం అంత తేలిక విషయం కాదు. కాని ఈ సారి రాష్ట్రం నుండి హజ్ ధరఖాస్తుల సంఖ్య కాస్త తగ్గింది. దేశవ్యాప్తంగా ఎంపికైన కొంత మంది చివరి క్షణంలో మక్కాకు వెళ్లేందుకు వెనక్కు తగ్గడంతో వెయిటింగ్ జాబితాలో ఉన్న వారికి అవకాశం లభిస్తుంది. 2025 హజ్ యాత్రకు రాష్ట్రం నుంచి దాదాపు 9 వేల మంది యాత్రికులు దరఖాస్తు చేసుకున్నారు. వారందరికీ మక్కాకు వెళ్లే అవకాశం లభించనున్నట్లు తెలుస్తోంది. ఏటా గరిష్టంగా 6 నుంచి 7 వేల మందికి మాత్రమే తీర్థ యాత్రలకు వెళ్లే అవకాశం లభించేది.

ఈసారి రాష్ట్ర హజ్ యాత్ర కోటాను కేంద్రం పెంచింది. మరోవైపు దరఖాస్తులు తక్కువగా రావడంతో అందరూ హజ్ యాత్రకు వెళ్లే అవకాశం వచ్చింది. ఈ ఏడాది హజ్ కమిటీకి 9,011 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో డ్రా ద్వారా 6,519 మందిని ఎంపిక చేయడం జరిగింది. తొలి విడుత హజ్ రుసుము 1,30,000 చెల్లింపు గడువు ముగిసిన తర్వాత దేశ వ్యాప్తంగా డబ్బు చెల్లించని వారిని మినహాయించడంతో ఆ స్థానాలను వెయిటింగ్‌లో ఉన్న వారితో భర్తీ చేయడం జరిగింది. దీని ప్రకారం కేంద్ర హజ్ కమిటీ మన రాష్ట్రం నుంచి వెయిటింగ్ లీస్ట్‌లో ఉన్న 1631 మందిని హజ్ యాత్రకు అవకాశం కల్పించింది. దీంతో రాష్ట్ర హజ్ కమిటీ నుండి హజ్ యాత్రకు ఎంపికైన వారి సంఖ్య 8,150కి చేరుకుంది. తొలివిడుత హజ్ రుసుము చెల్లించిన వారు ఈ నెల 16 లోగా రెండో విడుత హజ్ రుసుము రూ. 1,42,000 చెల్లించాల్సి ఉంది. వెయిటింగ్ లీస్ట్ నుండి ఎంపికైన 1631 మంది ఈ నెల 16 లోగా రెండు విడుతులు కలిపి ఒకే సారి రూ.2,72,300 చెల్లించాల్సి ఉంది.

మూడో విడుత చెల్లింపు తర్వాత ప్రకటించడం జరుగుతుంది. అయితే రెండు విడుతలు చెల్లింపు గడువు పూర్తైన తర్వాత దేశ వ్యాప్తంగా డబ్బు చెల్లించిన వారి సంఖ్యను సరి చూసుకొని వెయిటింగ్‌లో ఉన్న వారిని తీసుకునే అవకాశం ఉంది. ఈ ప్రకారం మన రాష్ట్రం నుండి కేవలం 861 మంది మాత్రమే వెయిటింగ్‌లో ఉండడంతో అందరికి హజ్ అవకాశం లభిస్తుందని భావిస్తున్నారు. 2024 హజ్ యాత్రకు 11 వేల దరఖాస్తులు వచ్చాయి. వీరిలో రాష్ట్రం నుంచి 7,500 మందికి మాత్రమే పాదయాత్రకు అవకాశం లభించింది. సెంట్రల్ హజ్ కమిటీ 2025కి రాష్ట్ర హజ్ యాత్రికుల కోటాను పెంచింది, వచ్చే ఏడాది జూన్ 4 నుంచి 9వ తేదీ వరకు హజ్ యాత్ర కొనసాగనుంది. కాగా ఈ నెల 17న రాష్ట్ర హజ్ కమిటీ కార్యాలంలో జిల్లా హజ్ సొసైటీల అధ్యక్ష, కార్యదర్శులు సమావేశం నిర్వహిస్తున్నారు. రాష్ట్ర హజ్ కమిటి చైర్మన్ అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుంది. ఈ నెల 22న హైదరాబాద్ మలక్‌పేట్‌లోని హైటెక్ గార్డెన్‌లో తొలి హజ్ శిక్షణా శిబిరం నిర్వహించనున్నారు. ఇందుకు ఇప్పటికే రాష్ట్ర హజ్ కమిటీ ఏర్పాట్లు చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News