లిన్జ్: ఆస్ట్రియా వేదికగా జరుగుతున్న లిన్జ్ ఓపెన్ మహిళల టెన్నిస్ టోర్నమెంట్‌లో రుమేనియాకు చెందిన రెండో సీడ్ సిమోనా హలెప్ సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. హోరాహోరీగా సాగిన క్వార్టర్ ఫైనల్ పోరులో హలెప్ 46, 75, 60తో ఇటలీకి చెందిన ఏడో సీడ్ జాస్‌మైన్ పౌలొనిను ఓడించింది. తొలి సెట్‌లో జాస్‌మైన్ ఆధిపత్యం చెలాయించింది. ఆరంభం నుంచే దూకుడుగా ఆడింది. హలెప్‌ను ఒత్తిడికి గురి చేస్తూ ముందుకు సాగింది. ఈ క్రమంలో 64తో జాస్‌మైన్ తొలి సెట్‌ను సొంతం చేసుకుంది. ఇక రెండో సెట్‌లో కూడా అద్భుత ఆటను కనబరిచింది. హలెప్‌ను దాదాపు ఓడించినంత పని చేసింది. కానీ కీలక సమయంలో హలెప్ పుంజుకుంది. తన మార్క్ షాట్లతో ప్రత్యర్థిపై ఎదురుదాడికి దిగింది. అద్భుత పోరాట పటిమతో టైబ్రేకర్‌లో సెట్‌ను సొంతం చేసుకుంది. ఇక ఫలితాన్ని తేల్చే మూడో సెట్‌లో హలెప్‌కు ఎదురే లేకుండా పోయింది. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఆడిన హలెప్ 60తో సెట్‌తో పాటు మ్యాచ్‌ను గెలిచి సెమీస్ బెర్త్‌ను దక్కించుకుంది. మరో క్వార్టర్ ఫైనల్లో రుమేనియాకే చెందిన జాక్వెలిన్ క్రిస్టియాన్ విజయం సాధించింది. నాలుగో సీడ్ వెరోనికా(చెక్)తో జరిగిన పోరులో క్రిస్టియాన్ 63, 76తో జయకేతనం ఎగుర వేసింది. మరో పోటీలో కొలిన్స్ (అమెరికా) జయభేరి మోగించింది.