అయోధ్య ఉత్సవాన్ని టీవీలలో వీక్షించేందుకు అవకాశం
న్యూఢిల్లీ: అయోధ్యలో ఈ నెల 22న జరగనున్న రామాలయ ప్రాణ ప్రతిష్టాపన మహోత్సవాన్ని టీవీలలో ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించేందుకు వీలుగా ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అర్ధరోజు సెలవు లభించనున్నట్లు వర్గాలు తెలిపాయి. ప్రభుత్వ కార్యాలయాలకు జనవరి 22న సగం రోజు సెలవు ఉంటుందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఇప్పటికే ప్రకటించగా ప్రభుత్వ పాఠశాలల విషఁంపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడవలసి ఉంది.
కాగా..అయోధ్య మహోమత్సవానికి జరుగుతున్న ఏర్పాట్లపై ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర మంత్రుల నుంచి సమాచారాన్ని తీసుకున్నట్లు వర్గాలు తెలిపాయి. తమ ఇళ్లలో దీపాలు వెలిగించాలని, పేదలకు అన్నదానం చేయాలని దీపావళి పండుగ తరహాలో వేడుకలు జరుపుకోవాలని మంత్రులను ప్రధాని ఆదేశించినట్లు తెలుస్తోంది. జనవరి 22న ఆలయం ప్రారంభమైన తర్వాత మంత్రులు తమ నియోజకవర్గాలకు చెందిన ప్రజల కోసం అయోధ్యకు యాత్రలను ఏర్పాటు చేయాలని ప్రధాని కోరినట్లు తెలుస్తోంది.
ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షించాలని, ఈ యాత్రలలో తమ నియోజకవర్గ ప్రజలతో కలసి అయోధ్యను సందర్శించాలని మంత్రులను ప్రధాని కోరినట్లు సమాచారం. రాముడి జన్మస్థలంగా విశ్వసించే ఉత్తర్ ప్రదేశ్‌లోని అయోధ్య పట్టణం జనవరి 22న జరిగే ఆరామాలయ ప్రాణ ప్రతిష్టాపన మహోత్సవం కోసం సర్వాంగ సుందరంగా ముస్తబవుతోంది. ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొనే ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా పలువురు విఐపిలకు, క్రికెటర్లకు, నటులకు, ఇతర ప్రముఖులకు ఆహ్వానాలు వెళ్లాయి. కాగా..ఈ కార్యక్రమానికి తాము హాజరుకావడం లేదని ప్రతిపక్ష నాయకులు ముఖ్యంగా ఇండియా కూటమికి చెందిన పలువురు ఇప్పటికే ప్రకటించారు.